American Express Centurion Credit Card: ఇప్పుడు, మన దేశంలో కోట్లాది మంది ప్రజలు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పని చేసే వ్యక్తులైతే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఇక బడా వ్యాపారవేత్తలు, ఉన్నత స్థాయి అధికారుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ల దగ్గర కూడా భారీ ఆఫర్లతో కూడిన క్రెడిట్ కార్డులు ఉంటాయి. అయితే, ఈ క్రెడిట్ కార్డుల పరిమితి గరిష్టంగా కొన్ని లక్షల రూపాయల వరకే ఉంటుంది. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దానిని జేబులో పెట్టుకుంటే కోటీశ్వరులవుతారని మీరు అంగీకరిస్తారు కూడా.
ఏ కంపెనీ క్రెడిట్ కార్డ్?
మనం మాట్లాడుకుంటున్న క్రెడిట్ కార్డ్ పేరు “అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్”. దీనిని బ్లాక్ కార్డ్ (Black Card) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డ్ అని చెప్పవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్ దీనిని జారీ చేస్తుంది. అయితే, ప్రతి వ్యక్తి ఈ కార్డును తీసుకోలేరు, ప్రత్యేకమైన వ్యక్తుల మాత్రమే లభిస్తుంది. దీని కోసం కంపెనీ కొంతమందిని మాత్రమే ఎంపిక చేస్తుంది. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల కోట్ల ప్రజల్లో, ఈ క్రెడిట్ కార్డును కేవలం 1 లక్ష మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్ ఉన్న వ్యక్తులు గరిష్టంగా 200 మాత్రమే ఉన్నారు.
ఈ క్రెడిట్ కార్డ్ పరిమితి ఎంత?
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ క్రెడిట్ కార్డ్ ఖర్చు పరిమితి రూ. 10 కోట్ల వరకు ఉంటుంది. ET రిపోర్ట్ ప్రకారం, మీ దగ్గర ఈ క్రెడిట్ కార్డ్ ఉంటే, మీరు దీని ద్వారా రూ. 10 కోట్ల విలువైన దేనినైనా కొనుగోలు చేయవచ్చు.
ఈ క్రెడిట్ కార్డ్‌ను ఎలా పొందాలి?
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు అంటూ ఏమీ ఉండదు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్, తాను ఎంపిక చేసిన కొంతమందికి ఈ కార్డ్‌ను ఆఫర్ చేస్తూ ఇన్విటేషన్ పంపుతుంది. ఈ ఆహ్వానం ప్రపంచంలో అత్యధిక సంపద కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే అందుతుంది.
ఏటా రూ.లక్షల ఫీజ్
సాధారణంగా, కార్డ్ పరిమితి ఎంత ఎక్కువగా ఉంటే దాని వార్షిక రుసుములు కూడా అంత ఎక్కువగా ఉంటాయి. ఈ కార్డ్ కూడా అంతే. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ క్రెడిట్ కార్డును ఉపయోగించినందుకు సంవత్సరానికి 5 వేల నుంచి 7 వేల డాలర్ల వరకు యాన్యువల్ ఫీజ్ చెల్లించాలి. ఇది, భారత రూపాయిలలో దాదాపు రూ. 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుంది.
ఈ కార్డుతో ఎలాంటి సౌకర్యాలు అందుతాయి?
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్‌తో కార్డ్ హోల్డర్లు చాలా ప్రత్యేక సౌకర్యాలను ఎంజాయ్ చేస్తారు. ప్రీమియం రెస్టారెంట్లు, హోటళ్లు, విమాన ప్రయాణం, పర్యటనలు, ప్రైవేట్ జెట్‌ల కోసం చివరి నిమిషంలో బుకింగ్ సౌకర్యం వంటివి దీనితో సాధ్యం. 140 దేశాల్లోని 1400కు పైగా విమానాశ్రయాలలో ఈ కార్డ్ హోల్డర్లకు ప్రాధాన్యత ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: ఆధార్ నుంచి ఐటీఆర్ వరకు తక్షణం మీరు తెలుసుకోవాల్సిన అప్‌డేట్స్ ఇవి- లైట్ తీసుకుంటే 2025లో మోత మోగిపోద్ది!