Answer Key Challenge for JEE(Main) 2025 Session-1: దేశవ్యాప్తంగా జనవరి 22 నుంచి 29 మధ్య నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 (జనవరి 2025) పేపర్-1 ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ (NTA) ఫిబ్రవరి 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఎన్టీఏ తెలిపింది. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 4 నుంచి 6న రాత్రి 11.50 గంటల వరకు అభ్యంతరాలు నమోదుచేయవచ్చు. ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1, జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. రోజూ ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 3- 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి.
ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదుకోసం క్లిక్ చేయండి..
అభ్యంతరానికి రూ.200 ఫీజు..
జేఈఈ మెయిన్ 2025 ఆన్సర్ కీని సవాలు చేయడానికి విండో ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ విండో ఫిబ్రవరి 6, గురువారం రాత్రి 11:50 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆన్సర్ కీని సవాలు చేయాలనుకునే అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎన్టీఏ తాజా నోటీసులో పేర్కొంది. ఈ ఫీజును డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చేయాలి. ఫీజులు రీఫండ్ చేయబడవు. మరే ఇతర విధానం ద్వారా చెల్లింపు చేయకూడదు.
ఒక ప్రశ్నకు మార్కులు..
జనవరి 23న తొలి విడత భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నను విరమించుకోగా, దానికి 4 మార్కులు కలుపుతారు. జనవరి 28న సాయంత్రం విడతలోని భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నకు 2 సమాధానాలు మార్చారు. అందులో దేన్ని గుర్తించినా మార్కులు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా 295 వరకు మార్కులు రావొచ్చని జేఈఈ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 12లోపు జేఈఈ మెయిన్ పర్సంటైల్ స్కోర్‌ను వెల్లడిస్తామని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 1 నుంచి రెండో విడత పరీక్షలు..
ఇక జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య నిర్వహించనున్నారు. రెండు విడత పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా వారికి ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు. దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో గతేడాది సుమారు 24 వేల సీట్లు;23 ఐఐటీల్లో 17,600 సీట్లు; ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8,500 సీట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన ప్రతి 100 మందిలో సరాసరిన నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతున్నాయి. జేఈఈ మెయిన్ చివరి విడత ముగిసిన తర్వాత రెండిటిలో ఉత్తమ స్కోర్ (రెండూ రాస్తే)ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్ 17వ తేదీ నాటికి ర్యాంకులు ప్రకటించనున్నారు. జేఈఈ మెయిన్ చివరి విడత దరఖాస్తులకు ఫిబ్రవరి 25 వరకు గడువు ఉంది.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి…
మరిన్ని చూడండి