Nehru Museum’s Renaming In Delhi Latest Flashpoint In BJP Vs Congress

Nehru Museum Renaming: 

పేరు మార్పు..

ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరుని మార్చుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. నెహ్రూ పేరు తీసేసి “ప్రధాన మంత్రి” (Prime Ministers’ Museum and Library Society) అని మార్చింది.  తీన్ మూర్తి భవన్ ప్రాంగణంలోనే ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ “ప్రధానమంత్రి సంగ్రహాలయ”ను ప్రారంభించారు. అప్పట్లో ప్రధాని నెహ్రూకి ఇదే నివాసంగా ఉండేది. అయితే…ఇప్పుడు మ్యూజియం పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సహా సీనియర్ నేతలంతా మండి పడుతున్నారు. దేశ తొలి ప్రధాని పేరుని కుట్రపూరితంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర లేని వాళ్లు…ఎదుటి వాళ్ల చరిత్రను చెరిపేందుకు ప్రయత్నిస్తారని తీవ్రంగా విమర్శించారు. 

“తమకంటూ ఓ చరిత్ర లేని వాళ్లే…ఇలా ఎదుటి వాళ్ల చరిత్రను చెరిపేందుకు కుట్ర చేస్తుంటారు. నెహ్రూ మ్యూజియం పేరు మార్చి ఆయన పేరుని తీసేయడం ఆయనను అవమానించినట్టే. నవ భారత నిర్మాత, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన యోధుడిని ఇలా కించపరుస్తారా…? బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనా వైఖరికి ఇదే ఉదాహరణ. వాళ్ల నియంతృత్వానికి ఇదే నిదర్శనం”

– మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా ట్విటర్‌లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విశ్వగురుగా చెప్పుకుని తిరిగే ప్రధాని మోదీ…ఇలాంటి పనులు చేస్తారా అంటూ మండి పడ్డారు. అభద్రతా భావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. 

“స్వతంత్ర భారత ఆర్కిటెక్ట్ జవహర్ లాల్ నెహ్రూ పేరుని తొలగించి ఆయన పేరుని చరిత్ర నుంచి చెరిపేయాలని కుట్ర చేస్తున్నారు. విశ్వగురుకి అభద్రతా భావం పట్టుకుంది. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు”

– జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత

అయితే…దీనిపై బీజేపీ కూడా స్పందించింది. తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. అనవసరంగా రాజకీయాలు చేయొద్దని తేల్చి చెప్పింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్విటర్‌లో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. 

“మన కన్నా ముందు దేశాన్ని పరిపాలించిన వాళ్లెందరో ఉన్నారన్న నిజాన్ని కాంగ్రెస్ తెలుసుకోవాలి. వాళ్లే మన దేశాన్ని నిర్మించారు. ప్రధాన మంత్రి సంగ్రహాలయ అనేది రాజకీయాలతో సంబంధం లేని విషయం. కానీ కాంగ్రెస్ ఇది అర్థం చేసుకోలేకపోతోంది”

– జేపీ నడ్డా, బీజేపీ జాతీయ కార్యదర్శి 

Source link