Not Just Tomato Other Vegetables And Rice Prices Are Increasing | Vegetables Price: టమాటా మాత్రమే కాదు బ్రో! అన్నింటి రేట్లు ఆకాశంవైపే పరుగులు

Vegetables Price: టమాటా ధర ఇంకా ఆకాశంలోనే విహరిస్తోంది. రోజుకో రికార్టు నమోదు చేస్తూ మరింత ఎత్తుకు ఎదుగుతుందే తప్పా.. ఇప్పట్లో దిగరానని మొండికేస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన వర్షాలు కురవడంతో చాలా వరకు పంట ధ్వంసమైంది. దీంతో దిగుబడి తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇప్పట్లో టమాటా ధర తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే కేవలం టమాటా మాత్రమే కాకుండా మిగతా కూరగాయల ధరలు కూడా సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేవు. చాలా రకాల కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆలూ మినహా ఇతర ప్రధాన ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 

గత ఏడాది కాలంలో పప్పు ధరలు గరిష్ఠంగా 28 శాతం పెరిగాయని, ఆ తర్వాత బియ్యం 10.5 శాతం, ఉరద్ పప్పు, ఆటా 8 శాతం పెరిగినట్లు ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ వారం పార్లమెంటుకు తెలిపింది. బియ్యం సగటు చిల్లర ధర ఏడాది క్రితం రూ.37 ఉండగా, గురువారం కిలో రూ.41గా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి తగ్గడమే పప్పు ధర పెరగడానికి కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2022-23 పంట సంవత్సరానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇచ్చిన మూడో ముందస్తు అంచనా ప్రకారం గత పంట సంవత్సరంలో 42.2 లక్షల టన్నుల పప్పు ఉతప్పతి 34.3 లక్షల టన్నులకు పడిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధరల పర్యవేక్షణ సెల్ ప్రకారం, గురువారం నాడు పప్పు సగటు రిటైల్ ధర కిలోకు 136గా ఉంది. గత ఏడాది కిలో రూ.106.5గా ఉండేది. గత ఏడాది రూ.106.5 గా ఉన్న మినపప్పు కిలో ధర రూ.114కి పెరిగింది. పెసర పప్పు కూడా రూ.102 నుంచి రూ.111 కి పెరిగింది. కూరగాయల్లో.. ఆలూ సగటు రిటైల్ ధర గతేడాది కంటే 12 శాతం తక్కువగా ఉండగా, ఉల్లి ధర గత ఏడాది కంటే 5 శాతం ఎక్కువగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. టమాటా ధరలపై మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. పంట కాలానుగుణత, తెల్ల ఈగ వ్యాధి, ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక వర్షాల కారణాల వల్ల పంట దిగుబడి లేక టమాటా ధరలు పెరిగినట్లు చెప్పుకొచ్చింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో టమాటా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో లాజిస్టిక్స్ లో సమస్యలు ఎదురైనట్లు వెల్లడించింది. 

Also Read: మీ ఇంటికి ఈడీ ఏం రాదు, శాంతించండి – ప్రతిపక్ష ఎంపీపై కేంద్రమంత్రి సెటైర్లు

ఆగస్టు 3న వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఢిల్లీలో టమాటా ధర రూ. 213కి పెరిగింది. దేశ రాజధానిలో సగటు టమాటా ధర జూలై 20 నాటికి కిలో రూ.120కి తగ్గింది. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా టమాటా సగటు ధర రూ.140.1గా ఉండగా, 2వ తేదీ రూ.137.06గా ఉంది. 1న సగటు ధర రూ.132.5 కాగా.. వారం రోజుల క్రితం సగటు ధర కిలో రూ.120గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆగస్టు 2న టమాటా కిలో రూ. 263కు విక్రయించబడింది. ఇది దేశంలోనే అత్యధిక ధరగా రికార్డ్ అయ్యింది. 

ఈ వివరాలు టమాటా ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో వివరిస్తోంది. మరికొన్ని రోజుల్లో కిలో రూ. 300కు చేరుకోవచ్చని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో దిగుబడి, దిగుమతి తగ్గిపోయిందన్నారు.  హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా కూరగాయల రవాణా కష్టంగా మారిందని ఆజాద్‌పూర్ మండికి చెందిన హోల్‌సేల్ వ్యాపారి సంజయ్ భగత్ తెలిపారు. కొండ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 

Source link