Pakistan Train Hijack: మంగళవారం (మార్చి 11, 2025) పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. దీనిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. అందరు BLA ఉగ్రవాదులను చంపేశామని చెప్పారు. షాబాజ్ షరీఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఇలా రాశారు: “జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడికి సంబంధించిన తాజా పరిణామాల గురించి ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టితో మాట్లాడాను. అనాగరిక చర్యపై యావత్ దేశం దిగ్భ్రాంతి చెందింది. అమాయకుల ప్రాణాలను కోల్పోవడం విచారంగా ఉంది. శాంతి స్థాపనకు పాకిస్తాన్ చేసే పోరాటన్ని ఇటువంటి పిరికి చర్యలు ఏం చేయలేవు. అమరవీరుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. డజన్ల కొద్దీ ఉగ్రవాదులను నరకానికి పంపారు.” అని చెప్పారు.
పాకిస్తాన్ అధికారులు ఏమంటున్నారు?
ఒక రోజు పాటు జరిగిన ప్రతిఘటన ముగిసిందని, దాడి చేసిన వారందరూ హతమయ్యారని పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. బందీల్లో కొందరు మరణించారని తెలిపారు.
మంగళవారం ప్రారంభించిన బలూచ్ ఉగ్రవాదులను హతమార్చే ఆపరేషన్ పూర్తైందని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు. ఉగ్రవాదులందరూ హతమైనట్టు ప్రకటించారు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న 500 మంది ప్రయాణికులను రక్షించడానికి సైనిక చర్య ముసిగిందని AFP తెలిపింది.
బుధవారం ఉదయం BLA చేసిన ప్రకటనలో మరో 50 మంది పాకిస్తానీ సైనికులను హతమార్చినట్లు తెలిపింది. దాదాపు 150 మంది బందీలు BLA అదుపులోనే ఉన్నారని ఆ బృందం తెలిపింది.
బోలాన్ జిల్లాలో హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ నుంచి ముందు 190 మంది ప్రయాణికులను విడిపించామని భద్రతా అధికారులు తెలిపారు.
పాక్‌లో జరుగుతున్న పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్ ఆందోళన
జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైలు నుంచి సందేశం ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాలనలో మాత్రం అలాంటి వాటికి తావులేకుండా చేశామని తెలిపారు.
‘దేశంలో ఉగ్రవాదం మరోసారి వేళ్లూనుకుంది’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మా పదవీకాలంలో, ఉగ్రవాదాన్ని విజయవంతంగా అరికట్టాం. పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేశాం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో దేశం ర్యాంకింగ్ నాలుగు స్థానాలు మెరుగుపడింది. అధికార మార్పిడి తర్వాత పరిస్థితి మారిపోయింది. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ మరోసారి ప్రపంచ ఉగ్రవాద సూచికలో రెండో అత్యంత ప్రభావిత దేశంగా మారింది.
పాకిస్తాన్ విదేశాంగ విధానంపై ప్రశ్నలు తలెత్తాయి
ఇమ్రాన్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ, ‘విదేశాంగ విధానాన్ని పాకిస్తాన్ దాని అంతర్గత వ్యవహారాల మాదిరిగానే చెత్తగా నిర్వహిస్తోంది. మనకు ఆఫ్ఘనిస్తాన్‌తో చాలా పొడవైన సరిహద్దు ఉంది. వారితో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. పొరుగు దేశాలతో మన విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉంటే తప్ప, దేశంలో శాంతిని ఆశించలేము. సైనిక కార్యకలాపాలతో సమస్యలకు పరిష్కారం లభించదు. పెద్ద యుద్ధాలు కూడా చర్చలు ద్వారా పరిష్కరమయ్యాయి.
‘నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి’
‘సరిహద్దులను రక్షించడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం నిఘా సంస్థల పాత్ర’ అని పిటిఐ చీఫ్ అన్నారు. వారు రాజకీయాల్లో బిజీగా ఉండి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)ని అంతం చేయడానికి ప్రయత్నిస్త్తోంది. సరిహద్దులను ఎవరు రక్షిస్తారు? బలూచిస్తాన్‌లో ఉగ్రవాదం వ్యాపిస్తోంది, అయినప్పటికీ ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగోలేదు. బలూచిస్తాన్ సహా మొత్తం దేశంలో ప్రజావిశ్వాసం ఆధారంగా ప్రభుత్వం ఏర్పడకపోతే స్థిరత్వం సాధ్యం కాదు.
ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ‘అడియాలా జైలు ప్రస్తుతం చట్టానికి అతీతంగా పనిచేస్తోంది. నా భార్యతో ములాఖత్ నా చట్టపరమైన, ప్రాథమిక హక్కు, కానీ జైలు మాన్యువల్‌కు విరుద్ధంగా, నా భార్యను కలవడానికి అనుమతించడం లేదు. కోర్టు ఆదేశం ఉన్నప్పటికీ, గత రెండు వారాలుగా నా పిల్లలతో మాట్లాడటానికి అనుమతించ లేదు. గత నాలుగు నెలల్లో వాళ్లతే మాట్లాడే అవకాశం నాలుగుసార్లు మాత్రమే లభించింది. నాకు పుస్తకాలు కూడా ఇవ్వడం లేదు. ఇదంతా ప్రాథమిక మానవ హక్కులు, జైలు మాన్యువల్ ఉల్లంఘన. అని అన్నారు.
మరిన్ని చూడండి