Passing Torch To Next Generation Says Joe Biden On Exiting US President Race | Joe Biden: కొత్త తరాలు రావాలనే పోటీ నుంచి తప్పుకున్నా

Joe Biden Exits President Race: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న జో బైడెన్ తొలిసారి స్పందించారు. దేశ ప్రజలందరినీ ఒకేతాటిపై ఉంచాలనే ఉద్దేశంతోనే తాను పోటీ నుంచి వైదొలగినట్టు వెల్లడించారు. తన పార్టీలోనూ ఐక్యత ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తన తరవాతి తరాలకూ అవకాశమివ్వాల్సిన సమయం వచ్చిందని వివరించారు. పోటీ నుంచి తప్పుకున్నాక తొలిసారి మీడియా ముందుకు వచ్చి స్పీచ్ ఇచ్చిన బైడెన్…కమలా హారిస్‌పై ప్రశంసలు కురిపించారు. ఆమెకు అధ్యక్ష పదవికి పోటీ చేసే సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. బైడెన్ తప్పుకున్నాక కమలా హారిస్‌ ప్రెసిడెంట్‌ రేసులోకి వచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

“ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అన్నింటి కన్నా చాలా కీలకమైన విషయం. ప్రెసిడెంట్ అనే పదవి కన్నా ముఖ్యమైన అంశం ఇది. అందుకే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇదే సరైన సమయం కూడా. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను”

– జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఇప్పటి వరకూ అమెరికా చరిత్రలో అధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తి ఇలా అర్ధంతరంగా తప్పుకోలేదు. ఈ విషయంలో బైడెన్ రికార్డు సృష్టించారు. ఎన్నో వారాలుగా బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని పోటీ నుంచి వైదొలగడమే మంచిందని సొంత పార్టీ నేతలే సలహా ఇచ్చారు. కానీ అందుకు బైడెన్ ఒప్పుకోలేదు. ఆ తరవాత బరాక్ ఒబామా కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన మానసికంగా కూడా సరిగ్గా లేరంటూ ట్రంప్‌ ఇప్పటికే విమర్శలు మొదలు పెట్టారు. ఈలోగా పరిణామాలు మారిపోయాయి. బైడెన్‌ చురుగ్గా ప్రచారం చేయలేకపోతున్నారు. తరవాత కొవిడ్ సోకడం వల్ల పూర్తిగా ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. ఫలితంగా ఆయనపై ఇంకా ఒత్తిడి పెరిగింది. ఆ తరవాత రెండు రోజులకే బైడెన్ ఈ ప్రకటన చేశారు. వచ్చే ఆరు నెలల పాటు పూర్తిగా తన విధులపైనే దృష్టి పెడతానని వెల్లడించారు. 

మరిన్ని చూడండి

Source link