Pawan to campaign for bjp in Delhi assembly elections

Delhi Elections | ఎన్డీఏ మిషన్ మహారాష్ట్ర ముగిసింది. ఇప్పుడు బిజెపి చూపు ఢిల్లీ పైనే ఉంది. 2014 నుంచి దేశవ్యాప్తంగా ప్రభంజనం చూపుతున్న బిజెపికి ఢిల్లీ రాష్ట్రం మాత్రం చేజిక్కడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వేరే పార్టీకి అవకాశం ఇవ్వడం లేదు. అయితే ఈసారి బిజెపి కూటమి తన తరఫున బ్రహ్మాస్త్రంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను ఉపయోగించబోతుంది. దాని కారణం ఢిల్లీలో సెటిల్ అయిన తెలుగు ఓటర్లు.

 ఢిల్లీలో తొమ్మిది లక్షల మంది తెలుగు ఓటర్లు 

 ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలు చెబుతున్న దాని ప్రకారం అక్కడ తెలుగు ఓటర్ల సంఖ్య 9 లక్షలకు పైమాటే. ఢిల్లీలోని మొత్తం 70 సీట్లలో 8 నియోజక వర్గాలు పూర్తిగా తెలుగు ప్రజల డామినేషన్ లోనే ఉంటాయి. ఢిల్లీ రాష్ట్రంలోని  సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ జిల్లాలోని కీలక నియోజకవర్గాలైన మునిర్కా, లజపత్ నగర్, వికాస్ పురి, షాహదరా, రోహిణి, కేశవ్ పూర్, మయూర్ విహార్, సరితా విహార్ లలో తెలుగు ఓటర్ల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇవిగాక మరో 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. అందుకే జాతీయ పార్టీలు అక్కడ ఉన్న తెలుగు ప్రజల్ని మచ్చిక చేసుకునే పనిలో ఉంటాయి.

గతంలో ఢిల్లీ ఎన్నికల్లో వైఎస్సార్ ప్రచారం

గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తరపున అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఢిల్లీలో ప్రచారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ అంటూ విడిపోయినా ఢిల్లీలో మాత్రం తెలుగు ప్రజలుగా కలిసే ఉన్నారు. తెలుగు సంఘాలు సైతం ఢిల్లీలో బతుకుతున్న తెలుగువారి సంక్షేమం దృష్టిలో పెట్టుకునే తెలుగు వారికి ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే మద్దతు పలుకుతున్నాయి. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవన్ లు సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గం నుంచే అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారంటే తెలుగు ప్రజలపై ఆయనకున్న నమ్మకమే కారణం. ఢిల్లీలో దాదాపు కోటిన్నర మంది ఓటర్లు ఉంటే వారిలో దగ్గరగా 6 శాతం మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. హోరాహోరీ గా పోటీ జరిగినప్పుడు ఫలితాలు తారుమారు కావడానికి ఆ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అందుకే తెలుగు ఓటర్లను మంచి చేసుకునే పనిలో పొలిటికల్ పార్టీలు పడ్డాయి. అందులో భాగంగానే బిజెపి  జనసేనాని పవన్ కళ్యాణ్ ను రంగం లోకి దించే ప్రయత్నం చేస్తోంది.

Also Read: CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ – రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!

ఎన్డీఏ కూటమి స్టార్ క్యాంపైనర్‌గా పవన్ కళ్యాణ్ 

బిజెపికి మొదటి నుంచి స్టార్ క్యాంపైనర్లు ఉన్నా  పవన్ కళ్యాణ్ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న సినీస్టార్ లేరు. ముఖ్యంగా యూత్ లో ఆయన ఫాలోయింగ్ తారస్థాయి కి చేరుకుంది. 2024 ఏపీ ఎన్నికల్లో గెలుపుతో పాటు, ఇటీవల ముగిసిన మహా రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం పవన్ సత్తాను బిజెపి నేతలకు తెలియజేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ  62 సీట్లు సాధిస్తే బిజెపి 8 సీట్లు గెలిచింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అయితే బీజేపీ మూడు సీట్లకే పరిమితమైంది.  దానితో ఎలాగైనా ఢిల్లీ సీఎం పీఠాన్ని ఈసారైనా సొంతం చేసుకోవాలని చూస్తున్న బిజెపి  నాయకత్వానికి పవన్ కళ్యాణ్ ఒక ఆశా కిరణంలా కనిపిస్తున్నారు. దానితో ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ తో గట్టిగా ప్రచారం చేయించాలని రంగం సిద్ధం చేస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి

Source link