PM Modi USA Tour Updates | వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉండగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఉగ్రదాడుల సూత్రధారిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. ముంబై ఉగ్రదాడుల కేసులో దోషిగా తేలిన టెర్రరిస్ట్ తహవూర్ రాణా (Tahawwur Rana)ను భారత్ కు అప్పగించేందుకు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో, అది కూడా ట్రంప్‌తో భేటీ సందర్భంగా ఈ ప్రకటన రావడం విశేషం. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని నరేంద్ర మోదీ అమెరికాలో అడుగుపెట్టగా ఘన స్వాగతం లభించింది.
పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు అయిన తహవూర్ రాణా 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో కీలక సూత్రధారుల్లో ఒకడు. ముంబై దాడుల్లో నిందితుడిగా ఉన్న అత్యంత ప్రమాదకర వ్యక్తిని భారత్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్ ఎప్పటి నుంచో ఈ ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ముంబై దాడుల నేరస్తుడిని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఫెడరల్ కోర్టును గతంలోనే ఆశ్రయించింది. కానీ గతంలో కోర్టు భారత్ అభ్యర్థనను తోసి పుచ్చింది. తాజాగా ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు రాగానే, ట్రంప్ భారత్‌కు అనుకూల నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై భారత్‌లో హర్షం వ్యక్తమవుతోంది.
ఉగ్రవాది తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముంబయి దాడుల మాస్టర్ మైండ్‌ను భారత్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నందుకు అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. టెర్రరిస్ట్ తహవూర్ రాణా ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ జైల్లో ఉన్నాడు. అతడ్ని తమకు అప్పగించాలని ప్రయత్నించగా.. గతంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. పలు ఫెడరల్ కోర్టుల్లోనూ భారత్‌కు ప్రతికూల తీర్పులే వచ్చాయి.
భారత్ వేసే పిటిషన్లు కొట్టివేయాలని 2024 నవంబరు 13వ అమెరికా ఫెడరల్ కోర్టులో తహవూర్ రాణా రిట్ పిటిషన్ వేశాడు. కానీ అక్కడి సుప్రీంకోర్టు అతడి అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో భారత్ ఆశలు చిగురించాయి. మరోవైపు ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంపె నెగ్గడం, తాజాగా మోదీ పర్యటన సందర్భంగా భారత్ కోరిక మేరిక ఉగ్రవాది అప్పగింతకు అంగీకరించారు.
2008 నవంబర్ 26న పాక్ ఉగ్రవాడులు ముంబైలో ఏకే-47 తుపాకులతో పలుచోట్ల దాడులు జరిపారు. టాటా గ్రూప్ హోటల్లోనూ కాల్పులు జరిపి ఎంతో మంది అమాయకులను ఉగ్రవాదులు బలిగొన్నారు. ఆ దారుణ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది సహా 166 మంది చనిపోయారు. ముంబై దాడుల మాస్టర్‌మైండ్ అయిన డేవిడ్ కోల్మన్ హెడ్లీకి తహవూర్ రాణా సహకరించినట్లు సమాచారం. వీరికి అంతకు 15 ఏళ్ల కిందట పరిచయం. ముంబై ఉగ్రదాడులకు బ్లూప్రింట్ తయారీలో రాణా ప్లాన్ చేశాడని అభియోగాలున్నాయి. ముంబై దాడులు జరిగిన కొన్ని నెలలకు చికాగో అధికారులు టెర్రరిస్ట్ తహవూర్ రాణాను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని చూడండి