Pamban Rail Bridge: భారత దేశ రైల్వే నెట్‌వర్క్‌లో ఇంకో మైలు రాయి. ఏప్రిల్ 6, 2025న దేశం రామనవమి జరుపుకుంటున్న టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామేశ్వరంలో పంబన్ రైలు వంతెన ప్రారంభించనున్నారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన. చాలా ఏళ్ల నుంచి ఇదో కలల ప్రాజెక్టుగా మారిపోయింది. ఇన్నాళ్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలక ఆనందానికి అవదుల్లేవు.
ఉత్తరాన ఆయోధ్య రాముడి ఆలయం ఉంటే దక్షిణాన రాముడు కట్టించిన వంతెన ఉంది. అలాంటి శ్రీరాముడు నడయాడిన ప్రాంతం నిర్మింతమైన వంతెన ప్రారంభం మర్చిపోలేని ఘట్టం. రామేశ్వరం తమిళనాడులోని తీరప్రాంత పట్టణం. ఇది పురాణాలతో ముడిపడి ఉన్న పవిత్ర ప్రదేశం.
కొత్త బ్రిడ్జి ఎందుకు నిర్మించారు
పంబన్ రైలు వంతెన ప్రధాన భూభాగంలోని మండపం రైల్వేస్టేషన్ నుంచి రామేశ్వరం ద్వీపం వరకు 2.08 కిలోమీటర్లు విస్తరించి ఉంది. బ్రిటీష్ కాలంలో 1914లో ఇక్కడ ఓ బ్రిడ్జ్ నిర్మించారు. వందేళ్ల పాటు సేవలు అందించిన పాతి వంతెన అది శిథిలావస్థకు చేరుకుంది. అందుకే దాన్ని 2022 డిసెంబర్‌లో క్లోజ్ చేశారు. అద్భుతమైన డిజైన్‌తో పాత వంతెన కంటే వెయి రెట్లు మన్నిక కలిగిన అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్త వంతెన నిర్మాణం చేపట్టారు.
2019లో శంకుస్థాపన చేసిన మోదీ
రామనాథ్ స్వామి ఆలయాన్ని సందర్శించే యాత్రికుల కోసం స్థానికుల కోసం వంతెనే చాలా కీలకం. రామేశ్వరాన్ని భారత్‌తో అనుసంధానించేది కూడా ఇదే వంతెన. అందుకే పాత వంతెనకు రిపేర్లు చేసినా ప్రయోజనం లేదని గ్రహించిన ప్రభుత్వం కొత్త బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. 2019లో కొత్త వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.
నేటి కాలంలో ఇంజినీరింగ్ అద్భుతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగానే 2019లో పునాదిరాయి పడింది. ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం కూడా జరగుతుంది. 550 కోట్ల రూపాయల అంచనాలతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ప్రారిభించింది. తుపానుల తాకిడి, కరోనా అలజడి ఇలా చాలా సమస్యలు ఈ వంతెనకు అడ్డుపడ్డాయి. ప్రజల ఆకాంక్ష, ఇంజినీర్ల పట్టుదల, ప్రభుత్వ సంకల్పంతో మానవ అద్భుతం ఆవిష్కృతమైంది.
ఇందులో 99 స్పాన్లు ఉన్నాయి. 72.5 మీటర్ల నిటారుగా ఉంటే లిఫ్ట్ స్పాన్ మరో అద్భుతం. ఇక్కడ ఉండే లిఫ్టులను 17 మీటర్ల ఎత్తు వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. దీన్ని చూసిన వాళ్లు ఇంజినీర్ల ప్రతిభను కొనియాడకుండా ఉండలేరు. సాధారణంగా రోడ్డులకు అడ్డగా రైల్వే ట్రాక్‌లు నిర్మించి ప్రత్యేకంగా గేట్లు పెట్టినట్టుగానే ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. సముద్రానికి అడ్డంగా వంతెన రైల్వే ట్రాక్ వేశారు. అయితే ఈ రైల్వే ట్రాక్ కారణంగా ఓడలు వెళ్లి వచ్చేందుకు ఇబ్బంది ఉందని ప్రత్యేకంగా లిఫ్ట్‌లు పెట్టారు.
ఓడలు వచ్చినప్పుడు రైల్వే ట్రాక్ ఓడ ఎత్తు వరకు పైకి లేస్తుంది. పాత బ్రిడ్జ్ ని మనుషులే లేపేవాళ్లు. దీనికి చాలా సమయం పట్టేది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఉండేలా హైడ్రాలిక్ యంత్రాలతో ఈ రైల్వే ట్రాక్‌ను పైకి లేపుతారు. ఇది దాదాపు 17 మీటర్ల ఎత్తు వరకు లేపవచ్చు. అది కూడా ఐదు నిమిషాల్లో ప్రక్రియ పూర్తి కానుంది. దీని వల్ల రైళ్ల ప్రయాణానికి కూడా అంతరాయం లేకుండా నిర్మాణాలు చేపట్టారు.
తుప్పు పట్టకుండా ఏర్పాట్లు
సాధారణంగా సముద్ర ప్రాంతంలో కట్టడాలు త్వరగా తుప్పు పట్టేస్తాయి. అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు ఈ బ్రిడ్జ్‌కు పాలీసిలోక్సేన్ పూత పూశారు. సముద్ర వాతావరణాన్ని తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది.
పురాతనాలతో సంబంధం
చార్‌ధామ్ తీర్థయాత్ర ప్రదేశాల్లో రామనాథస్వామి ఆలయం ఒకటిగా ఉంది. అలాంటి ప్రదేశానికి దారి చూపే రైలు వంతెన శ్రీరామనవమి రోజున ప్రారంభించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంతో శ్రీరాముడికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉందని చెబుతారు. ఇక్కడ ఉన్న ధనుష్కోడి ప్రాంతంలోనే సీతను రక్షించడానికి లంక వెళ్లేందుకు రామసేతు నిర్మించాడని పురాణాలు చెబుతాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం రామేశ్వరం చేరుకొని మధ్యాహ్నం వంతెన ప్రారంభిస్తారు. రామేశ్వరం తాంబరం రైల్ సర్వీస, కోస్ట్ గార్డ్ షిప్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రామనాథస్వామి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రార్థనలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మరిన్ని చూడండి