PM Narendra Modi Asks BJP Leaders To Reach Out To Muslim Women During Raksha Bandhan Festival | PM Modi: ముస్లిం మహిళలతో రాఖీ జరుపుకోండి

PM Modi: 2024లో అధికారమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు పెంచారు. ఎన్డీఏ కూటమి ఎంపీలతో వరుసగా భేటీ అవుతున్నారు. సోమవారం రాత్రి పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముస్లిం మహిళలకు భద్రతను పెంచిందన్నారు. రాబోయే రక్షా బంధన్ సందర్భంగా బీజేపీ నాయకులు ముస్లింలతో రాఖీలు కట్టించుకోవాలని సూచించారు. ఇతర సీనియర్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. సమాజంలోని వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను విరివిగా ప్రచారం చేయాలన్నారు. 2024లో అధికారం నిలుపుకోవాలన్నారు.

సమావేశంలో పాల్గొన్న కొందరు ఎంపీలు మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి వర్గంతో ఎంపీలు మమేకం అవ్వాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారని, ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గుర్తించారని చెప్పారు.  ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించిందన్నారు. మరి కొందరు ఎంపీలు మాట్లాడుతూ.. మైనారిటీ వర్గాల మహిళలకు చేరువయ్యేలా రక్షా బంధన్‌ సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని సూచించినట్లు చెప్పారు. రక్షన్ బంధన్ సోదరులు, సోదరీమణుల మధ్య బంధానికి ప్రతీక అని, ముస్లిం మహిళలతో ఎంపీలు అన్నాతమ్ముడిగా మెలుగుతూ సంబరాలు చేసుకోవాలని సూచించారు.

ముస్లిం మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల చర్యలను మోదీ తరచుగా ప్రస్తావిస్తున్నారు. ఇటీవల ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 4,000 మంది ముస్లిం మహిళలు హజ్ యాత్ర చేయడం భారీ మార్పు అన్నారు. ఎక్కువ మంది ప్రజలు తీర్థయాత్రకు వెళ్లే అవకాశాన్ని పొందుతున్నారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా హజ్ విధానంలో చేసిన మార్పులను వివరిస్తున్నారు. 

ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష పార్టీలు ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) పేరుతో ఏకం అయ్యేందుకు యత్నిస్తున్నాయని కానీ, కానీ అంతకు ముందున్న యుపీఏ అనేక కుంభకోణాలతో కలుషితమైందన్నారు. ప్రజలు ఎప్పటికి ఇండియాను అంగీకరించరని అన్నారు. స్నేహధర్మం పేరుతో యూపీఏ స్వార్థ పూరితంగా ఉందని విమర్శించిన మోదీ.. ఎన్డీఏ అంటే త్యాగాలకు నెలవు అన్నారు.

ఎన్‌డీఏ ఎంపీలను ప్రాంతాల వారీగా క్లష్టర్ల ఏర్పాటు చేసి, ఒక్కో దాంట్లో దాదాపు 40 మంది సభ్యులు ఉండేలా విభజించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోడీ వారితో ప్రత్యేకంగా మాట్లాడాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తొలి రెండు సమావేశాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం నుంచి కాన్పూర్-బుందేల్‌ఖండ్ ప్రాంతం వరకు దాదాపు 45 మంది ఎన్‌డీఏ ఎంపీల సమావేశంలో కూడా ఆయన ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్ ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార కూటమి సమాజానికి, దేశానికి సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. ప్రభుత్వ చేపట్టిన పనులు ప్రజలకు వివరించాలని, వారితో ఎక్కువ సమయాన్ని గడపాలని సూచించారు. 2024లో అధికారం నిలుపుకోవడానికి ఎంపీలు గడప గడపకు వెళ్లాలని ఆదేశించారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Source link