PM Narendra Modi to take holy dip at Kumbh tomorrow as Delhi goes to polls

PM Modi visit to Maha Kumbh: ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో జరగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దేశం నలుమూలల నుంచి కోట్లాది జనం కుంభమేళాకు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పలు దేశాల నుంచి కూడా ఔత్సాహికులు తరలివస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం చేసేందుకు షెడ్యూల్​ ఖరారైనట్లు సమాచారం. ​

ఉదయం 11–11.30 గంటల మధ్య పుణ్యస్నానం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న (బుధవారం) కుంభమేళాలోని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు ఓ సీనియర్​ అధికారి వెల్లడించాయి. ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరిస్తారని పేర్కొన్నారు. ‘బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్‌ ఘాట్‌కు వెళ్తారు. ఘాట్‌ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరిస్తారు. 11.45 గంటలకు బోటులో తిరిగి అరైల్‌ ఘాట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి దిల్లీ బయల్దేరుతారు’ అని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల రోజునే..
దాదాపు గంటన్నర పాటు మోదీ ప్రయాగ్‌రాజ్‌లో ఉండనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాగ్​రాజ్​తో పాటు కుంభమేళా వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ప్రధాని వెంట ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం పాల్గొనన్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల రోజునే ప్రధాని మోదీ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆసక్తిగా మారింది.

సాధువులతో మోదీ ఇంటరాక్ట్​ అవ్వనున్నారా?
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోరని, కేవలం పుణ్యస్నానం ఆచరించి గంగానదికి పూజలు చేయనున్నారని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే మోదీ సాధువులతో ఇంటరాక్ట్​ అవుతారని, మహాకుంభ మేళాకు వస్తున్న కోట్లాడి మంది యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లను కూడా సమీక్షిస్తారని మరి కొన్ని పేర్కొంటున్నాయి.

రూ.5500 కోట్లతో అభివృద్ధి పనులు
కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లిన ప్రధాని మోదీ.. రూ.5500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా.. జనవరి 13న కుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే దాదాపు 35 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

తొక్కిసలాటలో 30 మంద్రి మృతి
మౌని అమావాస్య నేపథ్యంలో కుంభమేళాలో ఈ నెల 29న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున దాదాపు 2.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగి 30 మంది మృతిచెందారు. 60 మందికిపైగానే గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు, సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు 3 గంటల పాటు క్షతగాత్రుల తరలింపు ప్రక్రియ సాగింది. విపరీతమైన రద్దీ వల్ల చీకట్లో అక్కడున్న చెత్త డబ్బాలకు కాళ్లు తగిలి ఒకరిమీద ఒకరు పడడంతోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పుణ్యస్నానాల నిలిపివేత.. ఆపై పునరుద్ధరణ తొక్కిసలాట ఘటనతో త్రివేణి సంగమం వద్ద కొన్ని గంటలపాటు పుణ్య స్నానాలను నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక అమృత స్నానాలను పునరుద్ధరించారు. 

Also Read: Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు

మరిన్ని చూడండి

Source link