Pune Crime News: మహారాష్ట్రలోని పూణే జరిగిన అత్యాచార ఘటన సంచలనంగా మారింది. స్వర్‌గేట్ బస్ స్టాండ్ వద్ద ఆగి ఉన్న మున్సిపల్ బస్సులో దత్తాత్రేయ గడే మహిళపై అత్యాచారం చేశాడు. 26 ఏళ్ల మహిళను రేప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి వేటలో పడ్డారు. నేరం చేసిన తర్వాత దత్తాత్రేయ గడే పరార్ అయ్యాడు. తన స్వగ్రామం అయిన శిరూర్‌లోనే ఉన్నప్పటికీ పోలీసులు పట్టుకోవడానికి మూడు రోజులు పట్టింది. చివరకు స్థానికంగా ఉండే ఓ చెరుకుతోటలో అర్థరాత్రి అరెస్టు చేశారు.
పూణే నగర డీసీపీ క్రైమ్ నిఖిల్ పింగలే తెలిపిన వివరాల ప్రకారం… నిందితుడు గత రెండు రోజులుగా సొంతూరిలోనే దాక్కున్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 13 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని కనిపెట్టిన వారికి లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించారు.
పూణే అత్యాచారం కేసు నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడే మంగళవారం నుంచి పరారీలో ఉన్నాడు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో స్వర్‌గేట్ బస్ స్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసినట్లు అతనిపై కేసు బుక్ అయింది.
బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను ఆమె వేచి ఉన్న బస్సు వేరే చోట ఆపి ఉందని చెప్పి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి బస్సులో కూర్చోబెట్టాడు. తర్వాత అక్కడే ఆగి ఉన్న బస్సు లోపల అత్యాచారం చేశాడు. పోలీస్ స్టేషన్‌కు దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం పెను సంచలనమైంది.
చెరకు తోటలలో పోలీసులు సోదాలు
నిందితుడి స్వస్థలంలో ఉండే చెరకు తోటల్లో పూణే పోలీసులు సోదాలు ప్రారంభించారు. సీనియర్ అధికారులతో సహా 100 మందికిపైగా పోలీసులు గురువారం అక్కడకు చేరుకున్నారు, ఈ ఆపరేషన్‌లో డ్రోన్‌లను కూడా వాడుకున్నారు. డ్రోన్‌లను ఎగరేస్తూ నిందితుడు ఎక్కడ ఉన్నాడో పరిశీలించే ప్రక్రియ చేపట్టారు.
ఓవైపు చెరకు తోటల్లో వెతుకుతూనే పూణేలోని ప్రతి ప్రాంతంపై నిఘా పెట్టారు. అన్ని ఎంట్రీలు, ఎగ్జిట్‌లు, ముఖ్యమైన బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అత్యాచార నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ప్రకటించారు. లక్ష రూపాయల బహుమతిని ఇస్తామని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై పూణే, సమీపంలోని అహల్యానగర్ జిల్లాల్లో దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ వంటి అనేక క్రిమినల్ కేసులు ఇప్పటికే ఉన్నాయి.
మరిన్ని చూడండి