punjab cm bhagwant mann meet arwind kejriwal in tihar jail | Kejriwal: కేజ్రీవాల్ ను కలిసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

Punjab Cm Bhagwant Meet Delhi Cm Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arwind Kejriwal)ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ (Bhagwant Mann) మంగళవారం కలిశారు. ఆయన్ను కలిసి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఇన్సులిన్ తీసుకుంటున్నారని వెల్లడించారు. ‘లోక్ సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా ప్రచారం చేయాలి. తన గురించి ప్రజలు ఆందోళన చెందొద్దని.. ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును అంతా వినియోగించుకోవాలి అని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.’ అని భగవంత్ మాన్ తెలిపారు. అలాగే, పంజాబ్ లో పరిస్థితులపై కేజ్రీవాల్ తనను అడిగారని అన్నారు. విద్యుత్ సరఫరా, పంటలు, గోధుమల ఉత్పత్తి వంటి అంశాలపై ఆరా తీశారని చెప్పారు. అలాగే, పంజాబ్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన 158 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటారని చెప్పడంతో ఆ మాట విని ఎంతో ఆనందించారని పేర్కొన్నారు. తన గుజరాత్ పర్యటన గురించి కూడా కేజ్రీవాల్ కు వివరించినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఈ మేరకు సందేశం ఇచ్చినట్లు చెప్పారు.

రెండోసారి..

కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై కేజ్రీవాల్ జైలుకు వెళ్లాకు పంజాబ్ సీఎం భగవంత్ ఆయన్ను కలవడం ఇది రెండోసారి. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేయగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో ఆయన ఏప్రిల్ 1 నుంచి తీహార్ జైలులో ఉన్నారు. అయితే, ఇదే కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సైతం ఈడీ, సీబీఐ అరెస్ట్ చేశాయి. దీంతో ఆమె కూడా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మరోవైపు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంపై సుప్రీం ఈడీని సమాధానం కోరింది. లోక్ సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారనే ప్రశ్నలపై ఈడీ స్పందించాలని తెలిపింది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం బెంజ్ దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. ఇక, కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే సమయంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. దీనిపై మే 3న తదుపరి విచారణ సందర్భంగా స్పందించాలని ఈడీకి సుప్రీం సూచించింది.

Also Read: Patanjali: ‘అధికారులు ఇప్పటికి నిద్ర లేచారు’ – పతంజలి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

మరిన్ని చూడండి

Source link