Purpose Of Arrest To Humiliate Me Claims Arvind Kejriwal in Delhi High Court Bail Hearing | నన్ను అవమానించేందుకే ఇలా అరెస్ట్ చేశారు

Kejriwal Bail Hearing: అరవింద్ కేజ్రీవాల్‌ జైల్‌లో నుంచి తనను వెంటనే విడుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఈడీ అరెస్ట్‌ని సవాల్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ కుట్రపూరితంగా తనను స్కామ్‌లో ఇరికించారని ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. జస్టిస్ స్వరణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. మోడక్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తరవాత కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడంపై తమకు అనుమానాలున్నాయని సింఘ్వీ కోర్టులో వెల్లడించారు. ఎలాంటి వాంగ్మూలం తీసుకోకుండానే ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇదే సమయంలో కేజ్రీవాల్ కూడా తన వాదనలు వినిపించారు. కేవలం తన పేరు ప్రతిష్ఠలు దిగజార్చేందుకే ఇలా అరెస్ట్ చేయించారని, ఎన్నికల్లో పోటీ చేయకుండా కుట్ర చేస్తున్నారని మండి పడ్డారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ని వ్యతిరేకించిన ఈడీ..ఇంకా విచారణ పూర్తి కాలేదని కోర్టుకి స్పష్టం చేసింది. 

“సెక్షన్ 50 కింద వాంగ్మూలం తీసుకోకుండానే అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇది కచ్చితంగా పరిగణించాల్సిన విషయం. కుట్రపూరితంగానే ఆయనను అరెస్ట్ చేసినట్టుగా భావించాల్సి వస్తోంది”

– అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ అడ్వకేట్ 

ఇప్పటికే ఈడీ కోర్టులో కీలక రిపోర్ట్‌ని అందించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌ సూత్రధారి కేజ్రీవాల్ అని తేల్చి చెప్పింది. అయితే…ఈ అరెస్ట్‌కి ముందు నుంచే అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్ట్‌పై చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఆప్‌ని ముక్కలు చేసి గెలవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ అయిన కొద్ది రోజులకే ఆయనను ఈడీ ప్రశ్నించడం, వెంటనే అరెస్ట్ చేయడం లాంటి పరిణామాలు దేశ రాజకీయాల్లో అలజడి సృష్టించాయి. కేజ్రీవాల్‌ని బయటకు తీసుకొచ్చేందుకు ఆయన లీగల్‌ టీమ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నప్పటికీ ఈడీ చాలా బలంగా వాదిస్తోంది. అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశామని తేల్చి చెబుతోంది. కేజ్రీవాల్ జైల్‌లో ఉన్నప్పటి నుంచి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష కూటమి నేతలు ఢిల్లీలో మెగా ర్యాలీ నిర్వహించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ని నిరసిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సునీతా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇదే వేదికపై ఆమ్ ఆద్మీ పార్టీ 6 హామీలనూ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కోతల్లేని విద్యుత్, నిరుపేదలకు ఉచితంగా కరెంట్‌ లాంటి హామీలు ప్రకటించారు. 

 

మరిన్ని చూడండి

Source link