Rahul Gandhi Launches Gruha Lakshmi Scheme In Karnataka

Rahul Gandhi: కర్ణాటకలో అమలు చేస్తున్న పథకాలను దేశమంతటా విస్తరింపజేసే ఆలోచన ఉన్నట్లు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం నాలుగో గ్యారెంటీగా ప్రతి గృహిణికి నెలకు రూ.2 వేలు అందించే గృహలక్ష్మి పథకాన్ని బుధవారం మైసూరులో ప్రారంభించారు. ముఖ్యమంత్రి సిద్దారామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభంచారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 1.1 కోట్ల మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.

ఈ సందర్భంగా సభకు భారీగా హాజరైన మహిళలను ఉద్దేశించి రాహుల్‌గాంధీ మాట్లాడారు. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్యారెంటీల పేరిట పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. కర్ణాటకలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తున్నట్లు చెప్పారు. మహిళలకు శక్తి గ్యారెంటీ పేరిట ఉచిత బస్సు ప్రయాణం, అన్నభాగ్య ద్వారా అదనంగా 5 కిలోల బియ్యం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. 

కర్ణాటకలో అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం దేశంలోనే అతిపెద్ద పథకమని, విదేశాల్లోనూ దీనిపై చర్చ జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యులకు జీవనం కష్టమైందని రాహుల్ గాంధీ అన్నారు. గ్యారెంటీ పథకాల అమలుతో ప్రజలకు వెసులుబాటు కలుగుతోందని తెలిపారు. తామెప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయబోమని చెప్పారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచి పనులను దేశమంతటా విస్తరించి చూపిస్తామన్నారు. కర్నాటకలో సిద్దారామయ్య ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందన్నారు.

ప్రభుత్వాలు పేదల కోసమే పాటుపడాలన్నది కాంగ్రెస్‌ విధానమని చెప్పారు. వేర్లు గట్టిగా ఉంటేనే చెట్టు దృఢంగా ఉంటుందని, కన్నడ మహిళలు వేర్ల వంటివారని అన్నారు. కర్ణాటక సాధించిన ప్రగతిలో మహిళలదే ప్రధాన పాత్ర అన్నారు. 70 ఏళ్లలో సాధించిన అభివృద్ధికి వారే కారణమని కొనియాడారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం మహిళలను నిర్లక్ష్యం చేస్తూ అపర కుబేరులను మాత్రమే నెత్తిన పెట్టుకుంటోందని విమర్శించారు. పథకాల అమలులో ఇప్పుడిక దేశమంతటా కర్ణాటక మోడల్‌నే అమలు చేస్తామని ప్రకటించారు. బీజేపీకి కాలం చెల్లిందని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయం అన్నారు.

సీఎం సిద్దారామయ్య మాట్లాడుతూ.. కర్ణాటకలో 1.24 కోట్ల మంది మహిళలు గృహలక్ష్మి పథకానికి అర్హులు ఉన్నారని చెప్పారు. వారిలో 1.11 కోట్లమంది దరఖాస్తు చేసుకున్నారని, వీరందరి ఖాతాలకు రూ.2వేలు జమ చేస్తామని తెలిపారు. గ్యారెంటీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.56 వేల కోట్ల భారం పడనుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎంతటి భారాన్నైనా భరిస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను గృహలక్ష్మి స్కీమ్ కోసం రూ.17,500 కోట్లు కేటాయించామని వివరించారు. ఐదో గ్యారెంటీ యువనిధి డిసెంబరులోగానీ, జనవరిలోగానీ ప్రారంభిస్తామన్నారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. గృహలక్ష్మి లాంటి స్కీమ్ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలేదన్నారు. ఐదు గ్యారెంటీ పథకాల్లో ఇప్పటికే శక్తి, గృహజ్యోతి, అన్నభాగ్య స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. 

Source link