Rajasthan Minister Rajender Gudha Sacked From Gehlot Cabinet As He Taunts At His Own Government

Rajender Gudha Sacked:

రాజేందర్ గుదా తొలగింపు..

రాజస్థాన్‌లో రాజకీయం వేడెక్కింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ కేబినెట్‌లోని మంత్రి రాజేందర్ గుదాని ఉన్నట్టుండి తొలగించింది ప్రభుత్వం. ఈ మధ్య సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు రాజేందర్. శాంతిభద్రతలు అదుపులో లేవని, మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆరోపించారు. ఆ కామెంట్స్‌పై హైకమాండ్ సీరియస్ అయినట్టు సమాచారం. అందుకే వెంటనే మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. నిజం చెబితే మంత్రిని తొలగిస్తారా..? అని ప్రశ్నిస్తోంది. అంతే కాదు. ఇది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కుట్ర అని ఆరోపించారు. బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ రాథోడ్ కాంగ్రెస్‌పై తీవ్రంగా మండి పడ్డారు. 

“రాజస్థాన్ మంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాడు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టాలని సూచించాడు. మహిళలపై నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ నంబర్‌ వన్ స్థానంలో ఉంది. మూడేళ్లుగా ఇదే దుస్థితి. ఆ నిజం చెప్పిన మంత్రిని కాంగ్రెస్ తొలగించింది. వాళ్లకు నిజాలు మాట్లాడే వాళ్లంటే నచ్చరు”

– రాజ్యవర్ధన్ రాథోడ్, బీజేపీ ఎంపీ

అసెంబ్లీలోనే విమర్శలు..

కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ కూడా దీనిపై స్పందించారు. నిర్బయంగా నిజాన్ని చెప్పిన రాజేందర్ గుదాకి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో మహిళలకే కాదు..మంత్రులకూ రక్షణ లేదని సెటైర్లు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇలా తొలగించారని ఆరోపించారు. రాజస్థాన్ బీజేపీ ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్ కూడా గహ్లోట్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. వాళ్ల ప్రభుత్వం ఇంకెన్ని రోజులో నిలబడలేదని గహ్లోట్‌కి కూడా తెలుసని, ఆ ఆక్రోశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. అశోక్ గహ్లోట్‌ రాజేందర్ గుదాని తొలగిస్తున్నట్టు జారీ చేసిన ఉత్తర్వులను గవర్నర్‌ వెంటనే ఆమోదించారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసపై మాట్లాడుతున్న తమ నేతలు..రాష్ట్రంలోని హింసపై ఎందుకు మాట్లాడడం లేదని రాజేందర్ ప్రశ్నించారు. అసెంబ్లీలో Minimum Income Guarantee Bill 2023 ని ప్రవేశపెడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాజేందర్. “మణిపూర్‌లో మహిళలకు భద్రత లేదని నినదించే ముందు మన రాష్ట్రంలోని పరిస్థితులను గమనించుకోవాలి. ఇక్కడి మహిళలకు భద్రత కల్పించాలి” అని అన్నారు. దీంతో ఒక్కసారిగా గహ్లోట్ షాక్ అయ్యారు. వెంటనే ఆయనను  ఆ పదవి నుంచి తొలగించారు. 

Source link