Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భారత్ రెండో టెస్టులో వెనుకంజలో నిలిచింది. తొలుత బ్యాటర్ల వైఫల్యంతో తక్కువ స్కోరే చేసిన టీమిండియా, ఆ తర్వాత బౌలింగ్ లోనూ తేలి పోయింది. తురుపు ముక్క జస్ఫ్రీత్ బుమ్రా మినహా మిగతా ఇద్దరు పేసర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీనిపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించారు. పేసర్లు ఆసీస్ బ్యాటర్లకు ఇబ్బంది పెట్టలేక పోయారని అభిప్రాయ పడ్డాడు.
బుమ్రా ఒక్కడే..
రెండో టెస్టు రెండో రోజులో ఒక్క జస్ ప్రీత్ బుమ్రా మాత్రమే ఆసీస్ ను నిలువరించగలిగాడని శాస్త్రి పేర్కొన్నాడు. అతను ఉన్నంత వరకు కంగారూ బ్యాటర్లు ఆచితూచి ఆడారని, అతని స్పెల్ అయిపోగానే మిగతా బౌలర్లపై విరుచుకు పడ్డారని తెలిపాడు. ముఖ్యంగా కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న హర్షిత్ రాణా తేలిపోయడని విమర్శించాడు. లైన్ అండ్ లెంగ్త్ పై ఆధార పడకుండా కేవలం వేగాన్ని నమ్ముకుని బండి నడిపే హర్షిత్ శైలిపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దీంతో శాస్త్రి ఏకీభవించాడు. ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ దూకుడుకు అతని వద్ద సమాధానమే లేదని అభిప్రాయ పడ్డాడు. అతను 16 ఓవర్లలోనే 86 పరుగులను ఐదుకుపైగా ఎకానీమీతో సమర్పించుకున్నాడు. అయితే సిరాజ్ మాత్రం ఆఖర్లో కంగారులను ఇబ్బంది పెట్టగలిగాడు. ఓవరాల్ గా బుమ్రాతో సమానంగా నాలుగు వికెట్లు తీశాడు.
షమీని దింపాల్సిందే..
వీలైనంత తొందరగా ఆసీస్ గడ్డపైకి షమీని దింపాల్సిందేనని శాస్త్రి వ్యాఖ్యానించాడు. గాయం నుంచి కోలుకుని దేశవాళీ టోర్నీల్లో తను సత్తా చాటుతున్నాడని, చాలా అనుభవం కూడా ఉండటం షమీకి పెద్ద ప్లస్ పాయింటని అభిప్రాయ పడ్డాడు. బుమ్రాకు షమీ తోడైతే కంగారూలను మరింత ఒత్తిడిలోకి నెట్టవచ్చని పేర్కొన్నాడు. మూడో టెస్టుకు అందుబాటులోకి రాకపోయినా, నాలుగో టెస్టు వరకైనా షమీని తుది జట్టులో ఆడించాలని భారత టీమ్ మేనేజ్మెంట్ కు సూచించాడు.
అదరగొడుతున్న షమీ..
ఇక నవంబర్ లో గాయం నుంచి కోలుకుని డొమెస్టిక్ క్రికెట్లో పునరాగమనం చేసిన షమీ.. అదరగొడుతున్నాడు. రంజీ మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసిన షమీ.. తర్వాత జరిగిన ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ అదరగొట్టాడు. మరోవైపు షమీ వీలైనంత త్వరగా ఆసీస్ వెళ్లేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసిందని సమాచారం. ఇప్పటికే వీసా రెడీ చేయగా, షమీ కిట్టును ఆల్రెడీ ఆసీస్ కు పంపినట్లు తెలుస్తోంది.
ఇక ఐదు మ్యాచ్ లో సిరీస్ ను గెలవడం భారత్ కు ఎంతో ముఖ్యం. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కి అర్హత సాధించాలంటే భారత్ కనీసం ఇంకా రెండు టెస్టులనైనా గెలుపొందాలి. పెర్త్ టెస్టులో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియా.. అడిలైడ్ టెస్టులో మాత్రం ఓటమి దిశగా సాగుతోంది. అయితే మిగతా మూడు టెస్టుల్లో కనీసం రెండు గెలిస్తే, దాదాపుగా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును భారత్ కైవసం చేసుకుంటుంది. ఇప్పటివరకు రెండుసార్లు జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ అర్హత సాధించింది. అయితే రెండుసార్లు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారైనా ఫైనల్ కి వెళ్లి, చాంపియన్ గా నిలిచి ఐసీసీ గదను దక్కించుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
మరిన్ని చూడండి