rbi angry on unfair practices in charging of interest from customers on bank loans | RBI News: లోన్లపై వసూలు చేసిన వడ్డీని కస్టమర్లకు తిరిగి ఇచ్చేయండి

RBI Angry On Unfair Practices Of Banks: భారతీయ బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ, బ్యాంక్‌లకు పెద్దన్న అయిన ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (RBI) బ్యాంకులు &ఎన్‌బీఎఫ్‌సీల (Non Banking Financial Companies) వ్యవహారం మీద ఆందోళన వ్యక్తం చేసింది. ఖాతాదార్లకు లోన్లు ఇచ్చిన తర్వాత, వారి నుంచి వడ్డీ వసూలు చేయడానికి బ్యాంకులు &ఎన్‌బీఎఫ్‌సీలు పాటిస్తున్న పద్ధతి సక్రమంగా లేదని ఆగ్రహించింది. 

2023 మార్చి 31తో ముగిసిన కాలానికి నియంత్రిత సంస్థల (Regulated Entities- REs) ఆన్‌సైట్ తనిఖీ చేపట్టిన ఆర్‌బీఐ.. కస్టమర్ల నుంచి వడ్డీ వసూలు చేయడానికి రుణదాతలు అనైతిక & అన్యాయమైన పద్ధతులను (Unfair Practices) అవలంబిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. లోన్‌ రీపేమెంట్‌లో పారదర్శకత కోసం.. లోన్‌ పంపిణీ పద్ధతులు, వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలను సమీక్షించాలని అన్ని REలను పెద్దన్న ఆదేశించింది.

అక్రమంగా వసూలు చేసిన వడ్డీని తిరిగి ఇచ్చేయాలి 
సాధారణంగా, ఒక వ్యక్తి బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో లోన్‌ అగ్రిమెంట్‌ చేసుకున్న తేదీకి, అతనికి లోన్‌ మంజూరైన తేదీకి మధ్య కొంత వ్యవధి ఉంటుంది. కొన్ని నియంత్రిత సంస్థలు లోన్‌ ఇచ్చిన తేదీ నుంచి కాకుండా లోన్‌ అగ్రిమెంట్‌ చేసుకున్న తేదీ నుంచే, అంటే కొన్ని రోజుల ముందు నుంచే వడ్డీ వసూలు చేస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గుర్తించింది. లోన్‌ ఇచ్చిన తేదీ నుంచి వడ్డీ వసూలు చేయాలిగానీ, ముందు నుంచే తీసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.

చాలా వక్రమార్గాలు
అంతేకాదు…. ఒక నెలలో బాకీ ఉన్న రోజులకు కాకుండా, ఆ నెల మొత్తానికి వడ్డీ విధించడాన్ని గమనించామని కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ చెప్పింది. కొన్ని నియంత్రిత సంస్థలు కొన్ని EMIలను ముందు నుంచే వసూలు చేస్తున్నాయనీ ఆన్‌సైట్ తనిఖీలో గుర్తించింది. లోన్‌ ఇవ్వని కాలానికి కూడా వడ్డీ వసూలు చేయడం న్యాయం కాదన్న పెదన్న, పారదర్శకత లోపించిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పిచ్చి పద్ధతులు పాటించిన బ్యాంకులు &ఎన్‌బీఎఫ్‌సీలు తమ తప్పును గుర్తించి, కస్టమర్‌ నుంచి అదనంగా వసూలు చేసిన వడ్డీ, ఇతర ఛార్జీలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. 

లోన్‌ను చెక్‌ రూపంలో ఇవ్వకుండా బ్యాంక్‌ అకౌంట్‌లోనే జమ చేయాలని కేంద్ర బ్యాంక్‌ సూచించింది. కస్టమర్‌కు చెక్‌ ఇచ్చిన తేదీ నుంచి కాకుండా, చెక్‌ను రూపొందించిన తేదీ నుంచి నియంత్రిత సంస్థలు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇది కూడా అనైతిక పద్ధతేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. లోన్‌ మంజూరు వ్యవస్థను మార్చాలని చెప్పింది. తన ఆదేశాలన్నింటినీ సర్క్యులర్‌ రూపంలో రిలీజ్‌ చేసిన ఆర్‌బీఐ, తన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టంగా చెప్పింది.

ఇప్పుడే కొత్త కాదు 
వాస్తవానికి, బ్యాంక్‌లకు RBI ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం కొత్త కాదు. లోన్లు ఇవ్వడం, వడ్డీ వసూళ్ల విషయంలో 2003 నుంచి REలకు గైడ్‌లైన్స్‌ ఇస్తూ వస్తోంది. ఆర్‌బీఐ చెప్పినప్పటికీ రుణదాతలు వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. ఆర్‌బీఐ ఆక్షేపించిన పాత పద్ధతులు వదిలేసి కొత్త పద్ధతుల్లో అన్యాయంగా వడ్డీలు వసూలు చేస్తున్నాయి.

మరో ఆసక్తికర కథనం: పైథాన్‌ బృందం మొత్తానికీ పొగబెట్టిన గూగుల్‌, ఒక్కరిని కూడా ఒదల్లేదు

మరిన్ని చూడండి

Source link