Reserve Bank of India New Governor Sanjay Malhotra: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రాను ఈ రోజు (11 డిసెంబర్ 2024) బాధ్యతలు స్వీకరించారు. ఆర్‌బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) పదవీ కాలం నిన్నటితో (10 డిసెంబర్ 2024) ముగిసింది. దాస్ స్థానంలో, సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ పరిపాలన పగ్గాలు అందుకున్నారు. ఇది మాత్రమే కాదు, దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టి, వేగంగా ముందుకు నడిపించే గురుతర బాధ్యతను కూడా మల్హోత్రా తీసుకున్నారు.
మిస్టర్ మల్హోత్రా, దేశ స్థూల ఆర్థిక సవాళ్ల సమయంలో భారతీయ కేంద్ర బ్యాంక్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి బాగా మందగించింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశంలో వివరిస్తుండడంతో ద్రవ్యోల్బణం అదుపులో లేదు, అధికారిక సగటు లక్ష్యమైన 4% నుంచి దూరంగా ఉంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (RBI MPC) తదుపరి మీటింగ్ 2025 ఫిబ్రవరి 5 – 7 తేదీల్లో జరుగుతుంది, ఇది మిస్టర్ మల్హోత్రా మొదటి ద్రవ్య విధాన సమీక్ష అవుతుంది. కొత్త గవర్నర్‌కు మొదటి సమీక్ష కాబట్టి, ఆ మీటింగ్ ఫలితాలపైన దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది.
సంజయ్ మల్హోత్రా చదువు, సర్వీస్
సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS (Indian Administrative Service) అధికారి. IIT కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. USAలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ కూడా పొందారు. సెంట్రల్ గవర్నమెంట్‌లో రెవెన్యూ కార్యదర్శిగా పని చేశారు, REC ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పదవిని నిర్వహించారు.
ఆర్‌బీఐ గవర్నర్ జీతం, ఇతర సౌకర్యాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ జీతం విషయానికి వస్తే… కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా రూ. 2.50 లక్షల జీతం తీసుకుంటారు. విశేషం ఏంటంటే, భారతదేశ ప్రధాని తీసుకునే జీతం కంటే ఆర్‌బీఐ గవర్నర్ జీతం ఎక్కువ. జీతంతో పాటు, ఆర్‌బీఐ గవర్నర్‌కు భారత ప్రభుత్వం నుంచి ఇల్లు, కారు, కారు డ్రైవర్, ఇంటి నిర్వహణకు పనివాళ్లు, ఇంకా అనేక ఇతర సౌకర్యాలు లభిస్తాయి.
సంజయ్ మల్హోత్రా ఇప్పటి వరకు ఎక్కడ పని చేశారు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఇప్పటి వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పని చేశారు. ఆయనకు ఆర్థిక పరిపాలన, పబ్లిక్ ఫైనాన్స్, ఎనర్జీ రిఫార్మ్ వంటి విషయాలపై మంచి అవగాహన ఉంది. దేవదాయ శాఖలోనూ మల్హోత్రా పని చేశారు.
పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా మూడు సంవత్సరాల వరకు సేవలు అందిస్తారు. ఆ తర్వాత, కేంద్ర ప్రభుత్వం అతని సేవలను పొడిగించవచ్చు లేదా కొత్త వ్యక్తిని ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమించవచ్చు. ఇప్పటి వరకు ఆ సీట్‌లో కూర్చున్న శక్తికాంత దాస్‌కు కూడా మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత, సేవా కాలాన్ని పొడిగించారు.
ఆర్‌బీఐ గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త గవర్నర్ పేరును కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ కమిటీ అప్రూవ్ చేస్తుంది. ఆర్‌బీఐ చట్టం 1934 ప్రకారం, కొత్త గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. దేశంలోని 26 మంది ఆర్‌బీఐ గవర్నర్‌లలో 13 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్లు కావడం విశేషం.
మరో ఆసక్తికర కథనం: ఏయే ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ కార్డ్‌తో రూ.5 లక్షల ఉచిత చికిత్స పొందొచ్చు?
మరిన్ని చూడండి