Real Estate news house rates in Hyderabad sore and average Home Prices In Top 7 Cities Hit Rs 1 23 Crores | House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు

Home Prices In Hyderabad: 2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) ప్రథమార్థంలో (2024 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలం), భారతదేశంలోని టాప్‌-7 నగరాల్లో అమ్ముడైన ఇళ్ల సగటు ధర రూ. 1.23 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది ఒక కోటి రూపాయలుగా ఉంది. దీంతో పోలిస్తే, ఈ ఏడాది సగటు ధర ఏకంగా 23 శాతం పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత కొత్త లాంచ్‌లు, ఖరీదైన గృహాల విక్రయాలు పెరగడమే ఈ వృద్ధికి కారణమని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ (Anarock) వెల్లడించింది.

భాగ్యనగరానికి బయటి నుంచీ డిమాండ్‌
అనరాక్‌ డేటాను బట్టి చూస్తే, భారతదేశ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ వాటా క్రమంగా పెరుగుతోంది, కీలకంగా మారుతోంది. టాప్‌-7 సిటీస్‌లో, హైదరాబాద్‌లో స్థిరాస్తి వృద్ధి బలంగా ఉంది. సమీక్ష కాలం H1FY25లో (2024 ఏప్రిల్‌-సెప్టెంబర్‌), హైదరాబాద్‌లో విక్రయించిన ఇళ్ల సగటు ధర రూ. 1.15 కోట్లకు చేరుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (H1FY24) ఇళ్ల సగటు ధర రూ. 84 లక్షలుగా ఉంది, ఇప్పుడు రూ.1.15 కోట్లకు చేరింది. అంటే, భాగ్యనగరంలో ఏడాది వ్యవధిలోనే ఇళ్ల రేట్లు ఏకంగా 37% పెరిగాయి. H1FY24తో పోలిస్తే H1FY25లో అమ్ముడైన ఇళ్ల సంఖ్య 29,940 నుంచి 27,820కి తగ్గినప్పటికీ, వాటి మొత్తం విలువ రూ. 25,059 కోట్ల నుంచి రూ. 31,993 కోట్లకు పెరగడం విశేషం. స్థానికులతో పాటు దేశం నలుమూల నుంచి పెట్టుబడిదార్లు హైదరాబాద్‌ వచ్చి ఇళ్లను కొనడమే దీనికి కారణమని అనరాక్‌ తెలిపింది.

మిగిలిన నగరాల్లో ఇలా..
H1FY25లో చెన్నైలో సగటు టిక్కెట్ సైజ్‌ కోటి కంటే తక్కువగా, రూ. 95 లక్షలుగా ఉంది. భారతదేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఇళ్ల యావరేజ్‌ ప్రైజ్‌ రూ. 1.21 కోట్లుగా, హైదరాబాద్‌ కంటే ఎక్కువగా ఉందని అనరాక్‌ డేటా చూపించింది. బెంగళూరులో, 2023-24 ఆర్థిక సంవత్సరం (FY24) మొదటి అర్ధభాగంలోని యావరేజ్‌ ప్రైస్‌ రూ. 0.84 కోట్ల నుంచి ఇప్పుడు అతి భారీగా పెరిగింది.

మరో ఐటీ నగరం పుణెలో, రెసిడెన్షియల్ మార్కెట్ H1FY24లో సగటు టిక్కెట్ పరిమాణం రూ. 0.66 కోట్ల నుంచి H1FY25 కాలంలో రూ. 0.85 కోట్లకు పెరిగింది. కోల్‌కతాలో H1FY25లో ఈ సంఖ్యను రూ. 0.61 కోట్లకు చేరుకుంది.

దిల్లీ-NCRలో సగటు టిక్కెట్ పరిమాణం H1FY24లోని రూ.0.93 కోట్ల నుంచి H1FY25లో రూ.1.45 కోట్లకు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ఉన్న ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో (MMR) సగటు ధర H1FY24 & H1FY25లో రూ.1.47 కోట్ల వద్ద స్థిరంగా ఉంది.

“2024 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కాలంలో, దేశంలోని టాప్-7 నగరాల్లో సుమారు రూ. 2,79,309 కోట్ల విలువైన 2,27,400 ఇళ్లు అమ్ముడయ్యాయి. దీనికి ముందు ఏడాది అదే కాలంలో,  సుమారు 2,35,200 యూనిట్లను రూ. 2,35,800 కోట్లకు విక్రయించారు. మొత్తం యూనిట్ అమ్మకాలు 3% తగ్గినన్నప్పటికీ, మొత్తం అమ్మకాల విలువ ఏడాది క్రితం కంటే ఈసారి 18% పెరిగింది. విలాసవంతమైన గృహాల కోసం ఎడతెగని డిమాండ్‌ను ఇది స్పష్టంగా చూపుతోంది” – అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పురి

అనరాక్‌ డేటాను లోతుగా పరిశీలిస్తే, దిల్లీ-ఎన్‌సీఆర్‌లో అత్యధిక సగటు టికెట్ పరిమాణం 56 శాతం వృద్ధిని నమోదు చేసింది. H1FY24లో నమోదైన యావరేజ్‌ ప్రైస్‌ రూ. 93 లక్షల నుంచి H1FY25లో రూ. 1.45 కోట్లకు పైగా పెరిగింది. టాప్‌-7 నగరాల్లో అత్యధిక వృద్ధి ఇక్కడ కనిపించింది.

మరో ఆసక్తికర కథనం: జొమాటోలో పెద్ద జాబ్‌ ఆఫర్‌ చేస్తే జనం తిట్టి పోస్తున్నారు, ఇదేందయ్యా? 

మరిన్ని చూడండి

Source link