Restrictions On Laptop Imports Central Government Rstricts Import Of Laptops Tablets Personal Computers

Restrictions on Laptop Imports: ఇతర దేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్‌లు, అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్‌లు, సర్వర్‌లపై దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆంక్షలు విధించింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. సరైన అనుమతులు ఉంటే వాటిని దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పించనున్నట్లు తెలిపింది. హెచ్ఎస్ఎన్ 8741 కింద దిగుమతి చేసుకునే ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు, వ్యక్తిగత కంప్యూటర్లు, అల్ట్రా స్మార్ట్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్లపై ఆంక్షలు విధిస్తున్నామని వాణిజ్య, పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. అయితే బ్యాగేజీ రూల్స్ కింద చేసుకునే దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించబోవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బ్యాగేజీ రూల్స్ అంటే.. దేశంలోకి ప్రవేశించే ప్రతి ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తారు. దీని ప్రకారం.. విదేశాల్లో ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు కొనుగోలు చేసి కస్టమ్స్ వద్ద సరైన ధ్రువపత్రాలు చూపిస్తే వాటిని అనుమతిస్తారు. 

ఈ చర్యతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇక ఈ కామర్స్ పోర్టల్స్ లో కొనుగోలు చేసి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దిగుమతి చేసుకునే ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, కంప్యూటర్లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్, బెంచ్ మార్కింగ్, మరమ్మతులు, రీ ఎక్స్ పోర్ట్, ప్రోడక్ట్ డెవలప్ మెంట్ కోసం దిగుమతి చేసుకునే వాటికి కూడా ఈ ఆంక్షలు వర్తించబోవని పేర్కొంది. అయితే ఇలా దిగుమతి చేసుకునే వాటిని ఎట్టి పరిస్థితుల్లో విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఇలా దిగుమతి చేసుకున్న ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లను పని పూర్తయిన తర్వాత ధ్వంసం చేయడమో లేదా తిరిగి ఎగుమతి చేయడమో చేయాలని సూచించారు. 

Source link