Retail inflation at 7-month low in February 2025 interest rates may fall further

Retail Inflation In India In February 2025: హోలీ, ఉగాది, రంజాన్‌ పండుగల సమయంలో దేశ ప్రజలకు పెద్ద శుభవార్త. గత నెల (2025 ఫిబ్రవరి‌)లో, భారతదేశ రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ రేటు 7 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారంగా లెక్కించే చిల్లర ద్రవ్యోల్బణం రేటు (CPI Inflation Rate) ఫిబ్రవరిలో 3.61 శాతంగా నమోదైంది. ఇది జనవరి కంటే 0.65 శాతం తక్కువ. గత ఏడాది జులైలో నమోదైన 3.54 శాతం తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన సంఖ్యే అత్యల్పం.  దేశంలో ద్రవ్యోల్భణం ఏడు నెలల కనిష్ట స్థాయికి దిగి రావడానికి ప్రధాన కారణం ఆహార ధరలు తగ్గడం. నెల క్రితం, 2025 జనవరిలో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ 4.26 శాతంగా ఉండగా; ఏడాది క్రితం, 2024 ఫిబ్రవరిలో ఇది 5.09 శాతంగా ఉంది. 

ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదల

2025 ఫిబ్రవరిలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం  (Food Inflation) 3.75 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జనవరిలోని 5.53 శాతంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 222 బేసిస్‌ పాయింట్లు తగ్గడం విశేషం. 2023 మే నెల తర్వాత, మళ్లీ 2025 ఫిబ్రవరిలో ఇది అత్యల్ప స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరిలో కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, పప్పుధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గడం ఈ తగ్గుదలలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

2024 ఫిబ్రవరితో పోలిస్తే 2025 ఫిబ్రవరిలో అత్యధికంగా తగ్గిన ఆహార ఉత్పత్తులు – అల్లం (-35.81%), జీలకర్ర (-28.77%), టమోటా (-28.51%), కాలీఫ్లవర్ (-21.19%), వెల్లుల్లి (-20.32%).

గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంధన ధరల్లోనూ ఉపశమనం లభించింది, ఇంటి బడ్జెట్లపై ఒత్తిడి తగ్గింది. ఇంధన ద్రవ్యోల్బణం రేటు 1.33 శాతం తగ్గింది.

2024 ఫిబ్రవరితో పోలిస్తే 2025 ఫిబ్రవరిలో కొన్ని ధరలు పెరిగాయి. అవి – కొబ్బరి నూనె (+54.48%), కొబ్బరి (+41.61%), ఉల్లిపాయలు (+30.42%), పసిడి (35.56%), వెండి (+30.89%).

ప్రాంతాల వారీగా ద్రవ్యోల్బణం గణాంకాలు

పట్టణ ప్రాంత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.32 శాతానికి దిగి వచ్చింది, ఇది జనవరిలో 3.87 శాతంగా ఉంది.
ఫిబ్రవరిలో, గ్రామీణ ప్రాంత ద్రవ్యోల్బణం 3.79 శాతానికి పరిమితమైంది, జనవరిలో ఇది 4.59 శాతంగా నమోదైంది.
రాష్ట్రాల వారీగా చూస్తే – ఫిబ్రవరిలో, కేరళలో అత్యధికంగా 7.31 శాతంగా ఉంటే, తెలంగాణలో అత్యల్పంగా 1.31 శాతంగా నమోదైంది.

ఆర్‌బీఐకి కూడా ఇది శుభవార్తే

రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతం కంటే తక్కువగా నమోదు కావడం ఉండటంతో కేంద్ర బ్యాంక్‌పై ఒత్తిడి తగ్గినట్లైంది. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి & ఉపాధిని పెంచడానికి వడ్డీ రేట్లను (RBI Repo Rate) మరింత తగ్గించే నిర్ణయం తీసుకోవడానికి RBIకి స్వేచ్ఛ దొరికింది. గత నెలలో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో (RBI MPC), ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాలసీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో, రెపో రేటు 6.25 శాతానికి దిగి వచ్చింది. ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే వృద్ధికి మద్దతు ఇచ్చే ‘తటస్థ వైఖరి’ని కొనసాగించాలని ఆ భేటీలో MPC నిర్ణయించింది. దీని అర్థం ద్రవ్యోల్బణం రేటు మరింత తగ్గితే, పాలసీ రేట్లను ఆర్‌బీఐ మరింత తగ్గించగలదు, ఇది ఆర్థిక వ్యవస్థలో వేగం పెంచుతుంది.

ద్రవ్యోల్బణం రేటు తగ్గడం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా, పెట్టుబడి & వినియోగదారుల వ్యయం పెరగడానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం.

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link