Rs 3 lakh crore to the railway budget this year and all eyes are on Vande Bharat Trains | Budget 2025 Expectations: ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ కోసం రూ.3 లక్షల కోట్లు!

Union Budget 2025 Expectations: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmal Sitharaman) 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 01, 2025న పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. ఈ పద్దులో భారతీయ రైల్వేల (Railway Budget 2025) కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది, గత ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల కంటే 15-20 శాతం ఎక్కువ. FY 2024-25 బడ్జెట్‌లో రైల్వేలకు రూ. 2.65 లక్షల కోట్లు కేటాయించారు. 

400 వందే భారత్‌లు ప్రభుత్వ లక్ష్యం
బడ్జెట్‌తో సంబంధం ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ అధికారి మనీకంట్రోల్‌కు ఇచ్చిన సమాచారం మేరకు, కేంద్ర ప్రభుత్వం రైల్వేల (Indian Railways) కోసం ఈసారి రూ. 2.93 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌ తీసుకురానుంది. రైల్వే మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ డబ్బును వినియోగిస్తారు. అనేక రైల్‌ స్టేషన్ల అప్‌గ్రేడేషన్ పనులు పూర్తవుతాయి, చాలా కొత్త రైల్వే ట్రాక్‌లు పనులు ప్రారంభమవుతాయి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్‌ పనులు పూర్తవుతాయి.

దీంతో పాటు, బడ్జెట్‌ నిధుల ఆధారంగా పెద్ద సంఖ్యలో అధునాతన రైళ్లను కూడా ప్రారంభించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 నాటికి, అదనంగా 68,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ను పెంచడంతో పాటు 400 వందేభారత్ రైళ్లను ‍‌(Vande Bharat Trains) నడపడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ దిశగా పనులు ముందుకు సాగాలంటే రైల్వే బడ్జెట్‌ కోసం ఎక్కువ మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అయితే, దీని కోసం జాతీయ రహదారుల ‍(National highways)‌ అభివృద్ధికి ఇచ్చే మొత్తంలో కోత పెట్టవచ్చు.

కొనసాగుతున్న అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు
ప్రస్తుతం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఇందులో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల నుంచి రైళ్లలో భద్రత షీల్డ్‌లు (Kavach) ఏర్పాటు చేయడం వరకు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇంకా, చాలా నగరాల్లో మెట్రో రైలు మార్గాలు కూడా వేస్తున్నారు. ఇది కాకుండా… 10 వందే భారత్ స్లీపర్ రైళ్ల ‍‌(Vande Bharat Sleeper Trains)తో పాటు, 100 అమృత్ భారత్ రైళ్ల (Amrit Bharat Trains)ను కూడా ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించవచ్చని సోర్స్‌లు చెబుతున్నాయి. వీటన్నింటికీ నిధుల కేటాయింపు జరగొచ్చని తెలుస్తోంది.

రైల్వే కంపెనీల షేర్లపై ప్రభావం
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైల్వేలకు రూ. 3 లక్షల కోట్లు ఇస్తే.. దాని ప్రత్యక్ష ప్రభావం రైల్ వికాస్ నిగమ్ (Rail Vikas Nigam), ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Oriental Rail Infrastructure), జూపిటర్ వ్యాగన్స్‌ (Jupitar wagons) వంటి రైల్వే సంబంధిత కంపెనీల షేర్లపై కనిపిస్తుంది. రైల్వే సెక్టార్‌ మాత్రమే కాదు, ఫిబ్రవరి 01న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని అన్ని రంగాలకు భారీ అంచనాలు ఉన్నాయి.

స్పష్టీకరణ: ఈ వార్త కేవలం సమాచారం కోసమే. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు సహా ఎలాంటి పెట్టుబడుల కోసం “abp దేశం” సలహా ఇవ్వదు. 

మరో ఆసక్తికర కథనం: ట్రంప్‌ దెబ్బకు ఏకంగా రూ.8,600 పెరిగిన గోల్డ్‌ రేటు – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ 

మరిన్ని చూడండి

Source link