న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మహిళ కుటుంబానికి 15 ఏళ్ల తరువాత పరిహారం దక్కనుంది. అది కూడా పాతిక లక్షలో కోటి రూపాయలో కాదు ఏకంగా రూ.9.64 కోట్లు బాధిత కుటుంబానికి చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వివరాలిలా ఉన్నాయి..

అసలేం జరిగిందంటే..
లక్ష్మి నాగళ్ల అనే మహిళ అమెరికాలో ఉద్యోగం చేసేవారు. ఏపీకి చెందిన ఆమె అగ్రరాజ్యంలో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసి అక్కడే జాబ్ చేస్తున్నారు. ఆమెకు అమెరికా పౌరసత్వం సైతం ఉంది. ఈ క్రమంలో 2009 జూన్‌ 13న కారులో తన భర్త, ఇద్దరు కుమార్తెలతో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి నాగళ్ల మృతిచెందారు. తన భార్య అమెరికాలో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసి అక్కడ జాబ్ చేస్తోందని, అమెరికా శాశ్వత నివాసిగా ఉందని ఆమె భర్త శ్యాంప్రసాద్ కోర్టును ఆశ్రయించాడు.

పరిహారం కోరుతూ పిటిషన్

తన భార్య ఆదాయం నెలకు 11,600 డాలర్లు అని, ఆమె మృతికి కారణమైన ఏపీఎస్ ఆర్టీసీ నుంచి రూ.9 కోట్ల మేర పరిహారం శ్యాంప్రసాద్‌ సికింద్రాబాద్‌ మోటార్‌ యాక్సిడెంట్స్‌ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. మృతురాలి కుటుంబానికి రూ.8.05 కోట్లు చెల్లించాలని 2014లోనే ట్రైబ్యునల్ ఆర్టీసీని ఆదేశించింది. ఏపీఎస్ఆర్టీసీ ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. టీజీ హైకోర్టు సైతం రూ.5.75 కోట్లు పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది.

సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు

తమకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ హైకోర్టు తీర్పును మృతురాలి భర్త సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్యాంప్రసాద్ పిటిషన్ మంగళవారం విచారణకు రాగా, అమెరికాలో ఉద్యోగం చేసే మహిళ చనిపోయారని, ఏపీఎస్‌ఆర్టీసీ ఆమె కుటుంబానికి రూ.9,64,52,220 పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఈ తీర్పునిచ్చింది.

Also Read: Andhra Pradesh CM Chandra Babu Latest News:మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు- భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నామని ప్రకటన