Salons in Delhi launch innovative campaign to encourage voting | Delhi Assembly Election : ఢిల్లీ ఎన్నికలు – ఓటెయ్యండి – 50% డిస్కౌంట్ పొందండి

Delhi Assembly Election : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే నగరంలో ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి పలు వ్యాపార సంస్థలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. ఓటు అందరి హక్కు, దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేస్తూ పలు వాణిజ్య సంస్థలు కొత్త ప్రచారం మొదలుపెట్టాయి. తమ సర్వీసుల్లో తగ్గింపులు ప్రకటిస్తున్నారు. ఓటు వేసిన తర్వాత వచ్చే వారికి సేవలపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని ట్రేడర్స్ అండ్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ (CTI) సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ కౌన్సిల్ ప్రకటించింది.

సెలూన్లు, బ్యూటీ పార్లలో డిస్కౌంట్లు

ఢిల్లీలో ఎన్నికలను పురస్కరించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచడానికి పలు మార్కెట్ సంఘాలు, వాణిజ్య సంస్థలు ముందుకొచ్చాయి. ఇందుకు నగరంలోని 500 కి పైగా సెలూన్లు, బ్యూటీ పార్లర్లు ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ విషయంపై స్పందించిన సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్.. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఓటు వేయమని ప్రోత్సహించడానికి, అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, ధాబాలు, మాల్స్ కూడా 10 నుండి 50 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయన్నారు. ఇందులో సెలూన్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు కూడా ఉన్నారని చెప్పారు. 

అయితే మరి ఈ డిస్కౌంట్ పొందాలంటే ఎవరు అర్హులు అన్న విషయానికొస్తే.. ఫిబ్రవరి 6న ఎవరైనా సెలూన్ లేదా బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వేలిపై ఉన్న ఓటు సిరాను చూపిస్తే, వారికి డిస్కౌంట్ లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. హెయిర్ కట్, షేవింగ్, ఫేషియల్, మసాజ్, డిటాన్ ప్యాక్ వంటి అనేక సర్వీసులపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ప్రచారంలో పాల్గొంటున్న మహిళా పారిశ్రామికవేత్తలు

నగరంలో ఓటింగ్ ను పెంచేందుకు పూనుకున్న చొరవలో చాలా మంది మహిళా పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొంటున్నారని సీటీఐ మహిళా మండలి ప్రధాన కార్యదర్శి ప్రియాంక సక్సేనా అన్నారు. వందన రావు, రష్మి ఛబ్రా, బబిత, రీనా కల్రా, సోనియా నాగ్‌పాల్, కీర్తి సింగ్, ఉషా గాంధీ, అంజు వర్మ, కుసుమ్ గోయల్, మంజు తన్వర్, నిషా రంజన్, దివ్య, ఉమా సిద్ధిఖీ, నందని గులాటి, హేమ, అనితా శర్మ వంటి ఎంతో మంది మహిళలు ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో సెలూన్లు నడుపుతున్నారని, వారి కస్టమర్లకు డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. 

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు

ఢిల్లీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో (2020), దాదాపు 62.59% మంది ఓటు వేశారు. అంతకుముందు 2015లో ఈ సంఖ్య 67.47%, 2013లో 66% ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఓటర్లను ప్రోత్సహించేందుకు, ఇలాంటి చిన్న ప్రోత్సాహకాలు ప్రజలను ఓటు వేయడానికి ప్రేరేపిస్తాయని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ చెప్పారు. వారికి అవగాహన కల్పించేందుకు, పోలింగ్ బూత్‌కు తీసుకురావడంలో సహాయకరంగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ వేటు వేయాలని పిలుపునిచ్చారు. 

అంతకుముందు కూడా పోలింగ్ రోజున ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఆఫర్లు ప్రకటించారు. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ఓటింగ్ రోజున పలువురు దుకాణదారులు, కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపులను ఇచ్చారు. గతంలో ఢిల్లీలో కూడా రెస్టారెంట్లు, మాల్స్‌లోనూ ఓటర్లకు ఈ తరహా డిస్కౌంట్లు ఇచ్చాయి. ఇప్పుడు సెలూన్లు, బ్యూటీ పార్లర్లు కూడా ఈ ప్రచారంలో చేరడం చెప్పుకోదగిన విషయం.

Also Read : Delhi Elections 2025: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ

మరిన్ని చూడండి

Source link