Satellite Based Toll System: భారతదేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టం 15 రోజుల్లో అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు. ఈ కొత్త విధానం రావడం వల్ల ఇకపై జాతీయ రహదారులపై టోల్ రేట్ల వద్ద ఆగాల్సిన పని ఉండదు. భారతదేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టం జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానాన్ని ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ఆధునిక ప్రక్రియ. ఈ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ వంటి సాంప్రదాయ టోల్ కలెక్షన్ పద్ధతుల అవసరంఉండదు. ఈ సిస్టం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సాంకేతికతను ఉపయోగించి, వాహనాలు రహదారిపై ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా వసూలు చేస్తుంది. దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగవలసిన అవసరం తగ్గుతుంది, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.
GNSS టెక్నాలజీ స్వదేశీ నావిగేషన్ సిస్టం అయిన నావిక్ తో పాటు GPS వంటి ఇతర గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లను ఉపయోగిస్తుంది. ఇది వాహనం ఖచ్చితమైన స్థానాన్ని ట్రాక్ చేస్తుంది. వాహనం జాతీయ రహదారిపై ప్రయాణించిన ఖచ్చితమైన దూరాన్ని లెక్కించి, ఆ దూరం ఆధారంగా టోల్ ఛార్జీలను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 50 కి.మీ. ప్రయాణిస్తే, ఆ దూరానికి మాత్రమే టోల్ వసూలు చేస్తంది. వాహనంలో ఉండే ఆన్-బోర్డ్ యూనిట్ లేదా GNSS-సామర్థ్యం గల పరికరం ద్వారా టోల్ మొత్తం బ్యాంక్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతుంది.ఈ విధానం అమలైన తర్వాత టోల్ బూత్‌ల వద్ద ఆగవలసిన అవసరం గణనీయంగా తగ్గుతుంది.చాలా ప్రాంతాల్లో టోల్ ప్లాజాలను తీసేస్తారు.
ఈ నెలలోనే పైలట్ ప్రాజెక్ట్‌గా కొన్ని ఎంచుకున్న జాతీయ రహదారులపై ప్రారంభం కానుంది. ఒక సంవత్సరంలో, అంటే 2026 నాటికి, దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను విస్తరించే ప్రణాళిక ఉంది. NavIC సిస్టం యొక్క పూర్తిస్థాయి అందుబాటు మరియు సాంకేతిక సంసిద్ధత ఆధారంగా గడువు నిర్ణయిస్తారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే మీద ఈ విధానం అమలును పరీక్షించారు. అయితే NavIC సిస్టం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు.
A new toll policy will be introduced within 15 days, featuring a satellite-based toll system. Vehicles won’t need to stop at plazas, as tolls will be auto-deducted via satellite imaging: Union Transport Minister Nitin Gadkari pic.twitter.com/5DFIxkIZ0r
— IANS (@ians_india) April 14, 2025
ఈ విధానం వల్ల కొన్ని ఆందోళనలు ఉన్నాయి. వాహనాల ట్రాకింగ్ వల్ల గోప్యత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డ్రైవర్లకు తగిన అవగాహన కల్పించడం అన్ని వాహనాలలో ఈ సిస్టం అమలు చేయడం సవాళ్లతో కూడుకున్నదిగా భావిస్తున్నారు. శాటిలైట్ సిస్టం పూర్తిగా అమలులోకి వచ్చే వరకు ఫాస్టాగ్ విధానం కొనసాగుతుంది. కొన్ని రహదారులపై రెండు విధానాలు సమాంతరంగా నడుస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సిస్టం భవిష్యత్తులో స్మార్ట్ హైవేల అభివృద్ధికి దోహదం చేస్తుంది జర్మనీ వంటి దేశాల్లో ఈ సిస్టం విజయవంతంగా అమలవుతోంది, భారతదేశం కూడా ఆ స్థాయి అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని చూడండి