ఒకప్పుడు హీరోగా ఆకట్టుకున్న శివాజీ, రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమా రంగానికి దూరమయ్యారు. అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. కొన్ని కారణాల వల్ల సినిమా ఆఫర్లను పెద్దగా అంగీకరించలేదు. అయితే 90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చి తన టాలెంట్‌ను మరోసారి నిరూపించుకున్నారు. అందులో మధ్యతరగతి తండ్రిగా నటించిన ఆయన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తాజాగా నాని నిర్మించిన కోర్ట్ సినిమాతో విలన్‌గా సరికొత్త అవతారం ఎత్తి ఇండస్ట్రీలో కొత్త అవకాశాలకు దారి తీసేలా చేశారు.
కోర్ట్ ట్రైలర్‌లోనే శివాజీ పాత్రకు ప్రత్యేకమైన గ్రావిటీ ఉందని అర్థమైంది. దర్శకుడు రామ్ జగదీశ్ ఈ పాత్రను విలన్‌గా కాకుండా తన విలన్‌గిరికి సమర్థన ఉన్నట్లు డిజైన్ చేయడం ఆసక్తికరంగా మారింది. అమ్మాయిలను కఠిన నియమాలతో పెంచాలనే మూర్ఖత్వంతో పరువు కోసం ఏకంగా హింసకైనా వెనుకాడని మంగపతి పాత్రలో శివాజీ అద్భుతంగా ఒదిగిపోయారు. హర్షవర్ధన్‌తో కలిసి వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయి. ముఖ్యంగా అతిగా ఆవేశపడే సన్నివేశాల్లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
శివాజీకి ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు ఉంది. కానీ కోర్ట్ సినిమాతో పూర్తిగా విలన్‌గా మారి మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. టాలీవుడ్‌లో శ్రీకాంత్, జగపతిబాబు లాంటి వారు హీరోలుగా స్టార్ట్ చేసి ఆ తర్వాత విలన్‌గా బ్రిలియంట్‌గా రాణించారు. ఇప్పుడు అదే మార్గంలో శివాజీ నడిచే అవకాశం కనిపిస్తోంది. గతంలో సోలో హీరోగా కొన్ని సినిమాలు చేసినా పెద్దగా హిట్లు దక్కించుకోలేకపోయారు. దాంతో సపోర్టింగ్ రోల్స్ వైపు వెళ్లిపోయారు. కానీ 90స్ మిడిల్ క్లాస్, కోర్ట్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మళ్లీ వెలుగులోకి వస్తున్నారు.
తనకు విలన్ రోల్స్ చేసేందుకు వీలు అవుతుందనే ఆలోచనే లేదని శివాజీ చెప్పుకున్నారు. కానీ నాని మాత్రం ఈ పాత్రకు ఆయననే ఫిట్ అన్న నమ్మకంతో కోర్ట్ లో విలన్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడదే అతనికి టర్నింగ్ పాయింట్ అవుతుందనే అభిప్రాయం పరిశ్రమలో వ్యక్తమవుతోంది. ఓ పక్క టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ విలన్ల కొరత ఉన్న నేపథ్యంలో శివాజీకీ రెగ్యులర్‌గా విలన్‌గా ఆఫర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ సినిమా తర్వాత శివాజీ మరిన్ని విలన్ పాత్రలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కోర్ట్ లోని మంగపతి పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి నిర్మాతలు, దర్శకులు ఆయనలోని కొత్త యాంగిల్‌ను గుర్తించే అవకాశం ఉంది. గతంలో హీరోగా తన స్థాయిని నిలబెట్టుకోలేకపోయినా ఇప్పుడైనా విలన్‌గా నిలదొక్కుకుంటే టాలీవుడ్‌లో మరొక పవర్‌ఫుల్ విలన్ అవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కోర్ట్ తర్వాత ఆయన కెరీర్ ఏ దిశగా సాగుతుందో చూడాలి.