Small Tsunami hits Japan’s Islands after small Quake

Tsunami Alert For Japan: మంగళవారం (సెప్టెంబర్‌ 24) నాడు జపాన్ రిమోట్ ఐలాండ్‌ హచిజోజిమా తీరాన్ని చిన్న సునామీ తాకింది. చైనా తీరంలోమి ఇజు ఐలాండ్స్‌లో రిక్టర్‌ స్కేలుపై 5.6 తీవ్రతతో భూమి కంపించడంతో ఈ సునామీ ఏర్పడినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సునామీ సంభవించింది.

ఒక మీటరు ఎత్తున అలలు ఎగసి పడి ఉండుంటే తీవ్రత ఎక్కువగా ఉండేది:

చైనా తీరంలో ఏర్పడిన భూకంపం తాలూకు ప్రభావంతో జపాన్ ద్వీపం హచిజోజిమా తీరంలో ఏర్పడిన సునామీ కారణంగా అలలు సాధారణం కన్నా 50 సెంటీమీటర్ల మేర ఎగసి పడ్డాయని అధికారులు తెలిపారు. భూకంపం ఏర్పడిన 45 నిమిషాల తర్వాత ఈ తేలికపాటి సునామీ సంభవించినట్లు  టోక్యోలోని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ సునామీ అలలు ఒక వేళ మీటరు ఎత్తున ఎగసి పడి ఉంటే నష్ట తీవ్రత ఎక్కువగా ఉండేదని తెలిపింది. ప్రస్తుతానికి ఏ విధమైన ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని స్పష్టం చేసింది. ఈ భూకంప కేంద్రం చైనా తీరంలో 11.5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మియాకెజిమా ద్వీప తీరంలోనూ భూకంప తీవ్రత కారణంగా స్వల్పంగా అలలు ఎగసి పడినట్లు పేర్కొంది. ఈ ద్వీపంలో దాదాపు 25 వేల మంది వరకూ నివసిస్తుంటారు. ఆ ప్రాంత ప్రజలు తామేమీ భూకంపాన్ని గుర్తించలేదని స్పష్టం చేశారు.

జపాన్‌ నుంచి తైవాన్ వరకు ఉన్న కోస్ట్ ప్రాంతంలోని చిబా నుంచి ఒకివానా వరకు సముద్రంలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. జపాన్ ఉన్న చోట భూమి పొరల్లో ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ కారణంగా జపాన్‌లో కనీసంగా ఏడాదికి 15 వందల భూకంపాలు వస్తుంటాయి. ఇందులో దాదాపు ఎక్కువ భూకంపాలు చాలా మైనర్‌గా ఉంటాయని జియోలాజికల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక వేళ భూకంప తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్నా.. ఆ ప్రకంపనల తీవ్రతను తట్టుకునేలా సాంకేతికత సాయంతో జపాన్ వాసులు తమ ఇళ్లను నిర్మించుకుంటూ ఉంటారు. సునామీ లాంటి ఘటనలు తప్ప భూకంపాల కారణంగా జపాన్‌లో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం ఉండదు.

వచ్చే 30 ఏళ్లలో జపాన్ అతి భారీ భూకంపాన్ని చూసే అవకాశం

ఏటా 15 వందల వరకు చిన్నపాటి భూకంపాలను చవిచూస్తున్న జపాన్‌.. రానున్న 30 ఏళ్ల వ్యవధిలో రిక్టర్‌ స్కేల్‌పై 8 నుంచి 9 తీవ్రతతో అత్యంత భయానకమైన, తీవ్రమైన భూకంపాన్ని చవి చూసే అవకాశాలు 70 శాతం ఉన్నట్లు జియోలాజికల్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జపాన్ ప్రభుత్వం కూడా ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేసి ఇప్పటి నుంచే భద్రతా పరమైన చర్యలు కూడా తీసుకుంటోంది. ఒకవేళ నిజంగా ఈ స్థాయి భూకంపం సంభవిస్తే.. పసిఫిక్ తీరంలో దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేశారు. ఈ నెలలో ఇప్పటి వరకూ ఐదు వరకూ తేలిక పాటి భూకంపాలను జపాన్ చూసింది.

2011లో జపాన్‌లో భూకంపం రిక్టర్ స్కేల్‌పై 9 తీవ్రతతో కంపించగా.. ఈశాన్య జపాన్‌లో భారీ సునామీ పుట్టుకొచ్చి బీభత్సం సృష్టించింది. దాదాపు 18 వేల 500 మంది వరకూ చనిపోవడం లేదా ఆ ప్రళయంలో కనిపించకుండా పోవడం జరిగింది. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లోని మూడు రియాక్టర్లను ప్రమాదంలో పడేసింది. జపాన్‌ రెండో ప్రపంచయుద్ధం తర్వాత మరోసారి అణు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చెర్నోబిల్‌ తర్వాత ఆ తరహా మరో ముప్పు ముంగిట జపాన్ నిలువగా.. జపాన్ శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Also Read: Israel-Hezbollah War: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు- 492 మందికిపైగా మృతి- ప్రజలకు నెతన్యాహూ తీవ్ర హెచ్చరిక

మరిన్ని చూడండి

Source link