Sun To Reach Solar Maximum In 2 Years, May Lead To Internet Apocalypse

Internet Apocalypse: నెట్ ఒక్క నిమిషం ఆగితే గిలగిల లాడిపోయే రోజులు వచ్చేసాయి. అలాంటిది అసలు ఇంటర్ నెట్ లేకపోతే ఊహించడమే కష్టం. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయే పరిస్థితికి చేరుకున్నాం ఇప్పటికే. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యవస్థ అంతం అయిపోవడం ఊహిస్తేనే ఎదురయే పరిస్థితులను అస్సలు అంచనా వేయలేకపోతున్నాం. కానీ ఎప్పుడైనా, భవిష్యత్‌లో ఏ విపరీత పరిణామం వల్లనో అలాంటి పరిస్థితి వస్తే ఎలా?  తాజాగా మరో రెండేళ్లలో అంటే 2025 నాటికి ఇంటర్నెట్ అంతం అవబోతుందని ఓ వార్తా కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

2025 నాటికి ఇంటర్నెట్ ఉండదు…

ప్రజలను అనుసంధానం చేసే ఇంటర్నెట్  మరో రెండేళ్లలో అంతమైపోతుందంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంటర్నెట్‌లోనూ ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. 2025 నాటికి సూర్యుడు ‘సోలార్ మ్యాగ్జిమమ్’ (గరిష్ఠస్థాయికి) చేరుకుంటాడని, అప్పుడు సోలార్ సైకిళ్ల కారణంగా సంభవించే సౌర తుపాన్లు భూమికి చేరుకుని కమ్యూనికేషన్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తాయన్నది ఆ కథనం సారాంశం. ‘సోలార్ మ్యాగ్జిమమ్’కు డిజిటల్ ప్రపంచం సిద్ధం కాకపోవడంతో ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని పేర్కొంది. దీనిని ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’గా వ్యవహరిస్తున్నారు.

సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ జరుగుతున్నప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, జనం మాత్రం సోషల్ మీడియాలో దీనిపై చర్చించుకుంటున్నారు. ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలితే జరిగే పరిణామాలపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అంతర్ అనుసంధానిత ప్రపంచంలో ఇప్పటి వరకు జరగని అరుదైన సంఘటన జరిగి ఇంటర్నెట్‌కు విఘాతం కలుగుతుందని వాష్టింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఈ సందర్భంగా 1859లో జరిగిన క్యారింగ్టన్ ఈవెంట్ ‌ను ప్రస్తావించింది. దీని కారణంగా అప్పట్లో టెలిగ్రాఫ్ లైన్లు ధ్వంసమయ్యాయి. ఎంతోమంది ఆపరేటర్లు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆ తర్వాత 1989లో సౌర తుపాను కారణంగా క్యూబెక్ పవర్ గ్రిడ్‌ కుప్పకూలింది.  

సోలార్ మ్యాగ్జిమమ్‌పై కాలిఫోర్నియా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సంగీత అబ్దు జ్యోతి రాసిన పేపర్ ‘సోలార్ సూపర్‌స్టార్మ్స్: ప్లానింగ్ ఫర్ ఇంటర్నెట్ అపోకలిప్స్’ కారణంగానే ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’ అనే పదం ఇప్పుడు వైరల్ అవుతోంది. శక్తిమంతమైన సౌర తుపానులు కనుక సంభవిస్తే దానికి మన మౌలిక సదుపాయాలు ఎలా స్పందిస్తాయో చూడాలని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి తుపాన్ల కారణంగా సముద్ర గర్భంలోని కమ్యూనికేషన్ కేబుళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటువంటి అంతరాయాలు నెలల తరబడి కొనసాగుతాయని అన్నారు. అదే జరిగితే అమెరికాలో రోజుకు 11 బిలియన్ల డాలర్లపైనే నష్టం వాటిల్లుతుందని వివరించారు.

ఇంటర్నెట్ లేకపోతే ఎదురయే పరిస్థితులు దారుణం…
         
ఒకవేళ ఇంటర్నెట్ వ్యవస్థ అంతరించిపోతే ఎదురయే పరిస్థితులు ఊహలకు చిక్కడం లేదు. అంతలా ఆధారపడిపోయింది ఈ ప్రపంచం. ప్రస్తుతం చేతిలో రూపాయి వుంచుకోవడం లేదు మనమెవ్వరం.  పైగా ప్రభుత్వం కానీ టాక్స్ విభాగాలు కూడా వుండకూదనే అంటున్నాయి. కార్డ్ లు, ఫోన్ పేలు, డిజిటల్ పేమెంట్లు ఇవన్నీ నెట్ లేకుండా పని చేయగలవా? వాట్సాప్ అనే ఒక్క వ్యవస్థ ఆధారంగా సమస్త సమాచార రంగం విపరీతంగా ఆధారపడిపోయింది. వార్తా ప్రపంచం మొత్తం నిట్ట నిలువుగా నిలిచిపోదూ? ఇలా ఒక్కో రంగం గురించి ఆలోచిస్తూపోతే అస్సలు నెట్ ఆగిపోతే ప్రభావితం కాని రంగం అన్నది లేనే లేదు అని అర్థం అవుతుంది. మన దేశంలో ప్రస్తుతానికి కేవలం వ్యవసాయం ఒక్కటే నెట్ మీద కాస్త తక్కువ ఆధారపడి వుంది. అంటే నెట్ లేకపోతే తిండి వరకు ఫరవాలేదు.  అది కూడా చేతిలో పైసలు వుంటే..లేదంటే ఛలో పల్లెటూరు అనడమే ప్రతి ఒక్కరూ. కానీ అప్పుడు కూడా ట్రైన్ టికెట్, బస్ టికెట్ తీయాలంటే నెట్ కావాలి కదా? సమస్యే.

Source link