TDP Announce It Supports To Delhi Services Bill To Boost BJP Govt In Parliament | Delhi Services Bill: పార్లమెంటులో ఢిల్లీ బిల్లుకు టీడీపీ మద్దతు

Delhi Services Bill: రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న తెలుగు దేశం పార్టీ.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ బిల్లు-2023కు టీడీపీ మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2018 లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) తో తెగదెంపులు చేసుకుని, ప్రదాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ.. ఇప్పుడు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయాలని యోచిస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతీయ పార్టీలైన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి. 

ప్రస్తుతం టీడీపీకి లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. ఈ సంఖ్యతో టీడీపీ బిల్లుపై కేంద్రానికి మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా పెద్దగా తేడీ ఏమీ ఉండదు. కానీ బీజేపీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీడీపీకి ఈ మద్దతు ప్రకటన కీలకంగా మారింది. బీజేపీకి అవసరం లేకపోయినా.. గతంలో పలుమార్లు మద్దతు ఇచ్చిన టీడీపీ.. మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తోంది. రాజ్యసభలో 9 మంది, లోక్‌సభలో 22 మంది సభ్యులు ఉన్న వైసీపీ ఇప్పటికే ఈ కీలకమైన బిల్లుపై ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ (BJD) మద్దతుతో మెజారిటీ మార్కును దాటి బిల్లు ఆమోదం పొందే వీలు ఉంటుంది. రాజ్యసభలో బీజేడీకి 9 మంది ఎంపీలు ఉండగా.. బీజేపీ సర్కారు ఎగువ సభలో హాఫ్ మార్కు దాటడానికి బీజేడీ సహాయపడుతుంది. రాజ్యసభలో హాఫ్ మార్కు 120 కాగా.. బీజేడీ, వైసీపీ, టీడీపీ, బీఎస్పీ మద్దతుతో బీజేపీ పార్టీకి 127 ఓట్లు రానున్నాయి. 

ప్రతిపక్ష ఇండియా కూటమికి 109 మంది సభ్యుల బలం ఉంది. బీఆర్ఎస్ ఏ రాజకీయ కూటమితోనూ లేకపోయినా.. ఢిల్లీ బిల్లును వ్యతిరేకిస్తోంది. కపిల్ సిబల్ తో పాటు మరికొందరు స్వతంత్ర్య ఎంపీలు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అయితే.. రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వం బిల్లు సులభంగానే నెగ్గుతుంది. 

మార్పులు చేసిన బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

ఢిల్లీ సర్వీసెస్ బిల్లులో కొన్ని మార్పులు చేసి Government of National Capital Territory of Delhi (Amendment) Billగా పిలుస్తున్నారు. ఈ ఏడాది మే నెలలోనే ఈ ఆర్డినెన్స్‌ని తయారు చేసినప్పటికీ సుప్రీంకోర్టు మందలించడం వల్ల వాయిదా పడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అధికారుల బదిలీ, నియామకాలపై పూర్తి అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటాయని తేల్చి చెప్పింది. అయినా కేంద్రం ఈ విషయంలో పట్టు విడవడం లేదు. స్టేట్ పబ్లిక్ సర్వీస్‌లతో పాటు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లలో ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో బిల్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే..ఇప్పుడీ బిల్‌ని పక్కన పెట్టి సంస్కరిస్తున్నారు. ఇందులోని కొత్త ప్రొవిజన్ ప్రకారం…ఢిల్లీ ముఖ్యమంత్రి నేతృత్వంలో నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ (National Capital Civil Service Authority) ఏర్పాటవుతుంది. ఈ అథారిటీ సూచనల ఆధారంగానే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సర్వీస్ కమిషన్‌లలో నియామకాలకు అనుమతినిస్తారు.

ముఖ్యమంత్రి అన్న మాటే కానీ తనకు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయని, అంతా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటోందని కేజ్రీవాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఆయన కేంద్రంపై న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆప్, బీజేపీ మధ్య వైరాన్ని మరింత పెంచింది ఈ బిల్. ఢిల్లీలోని అధికారులందరినీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది ఆప్. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిశారు. తమకు మద్దతునివ్వాలని కోరారు. ఈ విషయంలో తీర్పుని రివ్యూ చేయాలని కేంద్రం సుప్రీంకోర్టుని కోరింది. 

Source link