ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ ఎన్నో ఒడిదుడుకులు, అంతకు మించి అవాంతరాలు అన్నిటినీ దాటి ముందుకు వెళ్ళాల్సి వస్తోంది. ఎందుకంటే.. టీడీపీ కూటమి తరఫున టికెట్ల పంపకాలు, గెలిచాక మంత్రివర్గం ఏర్పాటు, ఆ తర్వాత అసంతృప్తులను బుజ్జగించడం ఇవన్నీ పెద్ద పరీక్షలే. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి అనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ విలవిలలాడింది. రాత్రింబవళ్ళు బెజవాడ కలెక్టర్ కార్యాలయాన్నే సీఎంవోగా అనుకుని అక్కడినుంచే సమీక్షలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, ఆపరేషన్ బుడమేరు, ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల తొలగింపు ఇలా ఒకటా రెండా చాలానే పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేశారు. వంద రోజుల్లోనే విజనరీ అనిపించుకున్నారు. ఇక సంక్షేమ పథకాలు అంటారా సాధ్యమైనంత మేరకు చేస్తూనే వస్తున్నారు చంద్రబాబు. ప్రతిపక్షాలు, విమర్శకుల నుంచి లేనిపోని ఆరోపణలు, తిట్లు అంటారా అవన్నీ మామూలే.
ఇదీ అసలు సంగతి..!
ఇప్పటి వరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో లడ్డూలో జంతు నూనె వాడారన్నది యావత్ ప్రపంచం వ్యాప్తంగా తెలుగు వారున్న ప్రతి చోటా ఇదే చర్చ. ఇదంతా వైసీపీ హయాంలో జరిగిందన్న అతి పెద్ద ఆరోపణతో సిట్ విచారణ జరుగుతోంది. ఇది ఎప్పుడు తేలుతుందో అన్నది చూడాలి. ఐతే ఈ పరిస్థితుల్లో.. ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఛైర్మెన్ పదవిలో చంద్రబాబు ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు..? ఇదే అందరిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. అసలే వెంకన్న సన్నిధిలో ఎలాంటి లోటు పాట్లు, వివాదాలకు చోటు లేకుండా చూడటానికి.. సీనియర్ నేతను ఎన్నుకోవాల్సి ఉంది. అందుకే బాబుకు ఇదొక పెద్ద టాస్క్ అని ముందుగానే చెప్పుకున్నది.
ఎవరో.. అతనెవ్వరో..!
నామినేటెడ్ పదవుల పంపకాలు మొదలయ్యాయి. ఇప్పటికే 20 కార్పోరేషన్లకు ఛైర్మెన్లను నియమించిన చంద్రబాబు.. టీటీడీ చైర్మన్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అసలే వివాదాలు, లడ్డూపై పెద్ద రచ్చ నడుస్తున్న ఈ తరుణంలో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా.. ఒకవేళ వచ్చినా అన్నీ మేనేజ్ చేసే సీనియర్ వ్యక్తి అయ్యుంటే బాగుంటుందని సీఎం భావిస్తున్నారట. ఇప్పటి వరకూ ఒకరిద్దరిని బాబు అనుకున్నప్పటికీ ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరిలో ఒక్కరూ సరిపోరట. అందుకే కాస్త ఆలస్యం ఐనా సరే సరైన వ్యక్తిని సీటులో కూర్చోబెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాకొద్దు బాబూ..!
ఇది నామినేటెడ్ పదవి కావడంతో కూటమిలోని బీజేపీ ఓ వైపు.. జనసేన మరోవైపు తమకే టీటీడీ చైర్మన్ పదవి కావాలని ఇన్నాళ్లు పట్టుబట్టి కూర్చున్నాయి. ఎప్పుడైతే లడ్డూ వివాదం సంచలనంగా మారిందో అప్పటినుంచి మాకొద్దు బాబూ.. మీ ఇష్టం టీడీపీ నుంచే ఎలెక్ట్ చేసుకోండి అని సీఎంకు చెప్పేసారట. టీటీడీ బోర్డు సభ్యులుగా మాత్రమే మా పార్టీ నేతలకు ఛాన్స్ ఇవ్వండి అని కోరుతున్నారట. అంటే చైర్మన్ నుంచి మెంబర్ వరకూ వచ్చారన్న మాట. మిత్ర పార్టీల నుంచి ఇలా సమాచారం రావడంతో టీటీడీ బోర్డు ప్రకటనపై సీఎం కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. తిరుమల పవిత్రత కాపాడేలా బోర్డు చైర్మన్, సభ్యులు ఉండాలే తప్ప.. అస్తమానూ ఏదో ఒక వివాదంలో మునిగితేలే పరిస్థితి ఉండొద్దని చంద్రబాబు కాస్త ఆలస్యం అయినా సీనియర్ నేతను సీటులో కూర్చోబెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకన్నకు ఐదేళ్ల పాటు సేవ చేసుకునేందుకు ఎవరికి లక్కీ ఛాన్స్ వస్తుందో చూడాలి మరి. చంద్రబాబు ముందున్న ఈ బిగ్ టాస్క్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదేమో.