నారా చంద్రబాబు నాయుడు అంటే.. విజనరీ.. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్.. పాలనలో ఆయన్ను ఢీ కొట్టేవాళ్ళు ఎవరూ లేరని అందరూ అంటూ ఉంటారు. కానీ.. బాబుకు ఉన్న ఫార్టీ ఇయర్స్ అనుభవంలో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి ఇలా జరగడం పలు సందేహాలకు తావిస్తోంది. అసలు ఆయన ఎందుకిలా చేస్తున్నారో..? బాబు మనసులో ఏముందో ఏమీ అర్థం కావడం లేదు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలతో అదేదో అంటారే పేరు గొప్ప.. లాగా అవుతుంది. అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్నా ఇంత వరకూ ఆ దిశగా ఎందుకు అడుగులు వేయకుండా.. మిన్నకుండిపోయారు అన్నది తెలియట్లేదు.
ఇదీ అసలు కథ..
అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అయినా.. చంద్రబాబుకు ఇంత అనుభవంకు పని పెట్టి కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి. గతంలో ఇలా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. మునుపెన్నడూ లేని ఆ పరిస్థితి ఇప్పుడు రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు గతంలో లేని ఈ పరిస్థితి ఇప్పుడే అదీ బాబు పాలనలో ఎందుకు వచ్చింది..? అనేది ఇప్పుడు సొంత పార్టీ నేతలు, మంత్రులకే అర్థం కావట్లేదు. ఎందుకంటే.. సూపర్ సిక్స్ వలన బడ్జెట్ పెట్టడానికి చంద్రబాబు ముందు అడుగు వేయలేకపోతున్నారనే చర్చ ఐతే రాష్ట్ర రాజకీయాల్లో గట్టిగానే జరుగుతోంది. మరోవైపు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా చెప్పినట్టుగా.. బాబు చెప్పే పథకాలు అమలు చేయాలంటే బడ్జెట్ కు 3 రెట్లు ఎక్కువ కావాలి అందుకే దాని జోలికి పోకుండా సీఎం ఉన్నారా..? అనే అనుమానాలు గట్టిగానే వస్తున్నాయ్.
బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతే..?
పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టకపోతే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి ఉండదు.. ఈ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఐతే.. రెండేళ్లకే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆలోచన ఏమైనా బాబుకు ఉందా..? ఒకవేళ ఉంటే మాత్రం ఇంకేముంది ఇంకో రెండేళ్లు సూపర్ సిక్స్ గోవిందా.. గోవిందా.. అనాల్సి వస్తుందేమో. దీనికి తోడు.. ఈ రెండేళ్ల పాటు.. జగన్ రెడ్డిపై అభాండాలు, నిందలు వేస్తూ, దుష్ప్రచారం చేస్తూ ఉండటమే పనిగా పెట్టుకుంటారా..? లేదంటే ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపట్టేది ఏమైనా ఉందా అన్నది సభ్య సమాజానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా చంద్రబాబుపై ఉంది. అంతే కాదు మళ్ళీ బాబు నోట.. ముందుకు వెళ్ళాలి అంటే భయమేస్తుందనే మాట రాకపోతే మంచిది.
టీటీడీ చరిత్రలో..!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలు కూటమి సర్కార్, చంద్రబాబు ఉన్న అపార అనుభవంతో కనీసం ఏడు కొండలలో కొలువైన శ్రీవారి సన్నిధికి ఛైర్మెన్ సీటులో ఎవరో ఒకరిని కూర్చోబెట్టలేక పోవడం గమనార్హం. బహుశా టీటీడీ చరిత్రలో చైర్మన్ లేకుండా మొదటిసారి బ్రహ్మోత్సవాలు కూడా జరగడం ఎంత విచిత్రమో. పోనీ టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలలో సమర్ధుడైన వ్యక్తి గత 120 రోజుల నుంచి దొరకడం లేదా..? అని సొంత పార్టీలోని కొందరు కార్యకర్తల నుంచి ఇలాంటి సందేశం వస్తోందంటే చంద్రబాబు ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జీతాల్లేవ్..!
కూటమి అధికారంలోకి వచ్చాక మొదట మూడు నెలల పాటు ఒకటో తారీఖు వచ్చాయి. ఐతే.. అక్టోబర్ నెలలో మాత్రం ఆలస్యంగా రావడంతో మూడు నెలల ముచ్చటేనా..? అంటూ ఒకింత ఉద్యోగులు సైతం నిట్టూరుస్తున్నారు. అంతేకాదు.. దాదాపు 40 వేల కోట్లు పైచిలుకు అప్పు చేసినా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. పథకాలు ఎలాగూ లేవు.. జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రావడం ఏంటి..? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..?. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కనీసం ముందుకొచ్చి మాట్లాడలేక పోతున్నారు. చూశారుగా.. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్టుగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయ్. అలాంటిది చంద్రబాబు ఎప్పుడు వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడతారో.. ఏంటో చూడాలి మరి.