Republic Day : అటెన్షన్ ఆల్.. ఎంతో మంది చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. కొత్త సంవత్సరం వేళ ఓ ముఖ్యమైన ప్రకటన వచ్చింది. జనవరిలో అత్యంత ముఖ్యమైన రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ రిట్రీట్ ను వీక్షించేందుకు విక్రయించే టిక్కెట్ల కొనుగోలుపై రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారమందించింది. జనవరి 2 నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో ఈ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఎంట్రీ టిక్కెట్లను ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా కేటాయించిన టికెట్ కౌంటర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. ఈ ఈవెంట్లను చూసేందుకు ఇష్టపడే వారు ఆన్లైన్లో లేదా ఢిల్లీ అంతటా కేటాయించిన కౌంటర్ల నుండి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
టిక్కెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే..
జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు టిక్కెట్ ధరలు రూ.20, రూ.100గా ఉంటాయి. జనవరి 28న జరిగే బీటింగ్ రిట్రీట్ రిహార్సల్‌కు టిక్కెట్ ధర రూ.20గా ఉండనుంది. జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకకు మాత్రం టిక్కెట్ ధర రూ.100గా నిర్ణయించారు. ఈ టికెట్ విక్రయాలు జనవరి 11 వరకు, రోజువారీ కోటా ముగిసే వరకు కొనసాగుతాయి.
టిక్కెట్లను ఆన్ లైన్ లో ఎక్కడ కొనుగోలు చేయాలంటే..
ప్రజలు ఈ టిక్కెట్లను అధికారిక వెబ్సైట్ aamantran.mod.gov.in ద్వారా లేదా ‘Aamantran’ మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వీటిని మొబైల్ సేవా యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ కోసం QR కోడ్ అధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.
ఆఫ్ లైన్ లో ఎక్కడ కొనుగోలు చేయాలంటే..
సామాన్య ప్రజలు ఢిల్లీలోని సేనా భవన్ (గేట్ నంబర్ 2), శాస్త్రి భవన్ (గేట్ నంబర్ 3 దగ్గర), జంతర్ మంతర్ (మెయిన్ గేట్), ప్రగతి మైదాన్ (గేట్ నంబర్ 1), రాజీవ్ చౌక్, మెట్రో స్టేషన్ (గేట్ నంబర్ 7, 8) వంటి ఐదు ప్రదేశాలలో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ప్రజలు ఈ కౌంటర్లలో జనవరి 2 నుండి జనవరి 11 వరకు, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
టిక్కెట్ కొనుగోలుకు ఏమేం కావాలంటే..
టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఆధార్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లేదా ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే ఫొటో IDలు ఆవశ్యకం. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకలు మరియు సంబంధిత ఈవెంట్ల గురించిన వివరాలను అధికారిక పోర్టల్ rashtraparv.mod.gov.inలో యాక్సెస్ చేయవచ్చు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు
రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ రిట్రీట్ వేడుకల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ఇవి భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వం, సైనిక బలం, సాంకేతిక పురోగతిని ప్రదర్శించే అత్యంత ఎదురుచూసే జాతీయ ఈవెంట్లలో ఒకటి.
Also Read : Southkorea Plane Crash: నీ కలలకు తోడుగా మీ నాన్న – కానీ, ఆ బాలుడి ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్లైట్ జర్నీ ఇదే, ఇంతకంటే విషాదం ఉంటుందా?
మరిన్ని చూడండి