Trump Imposes 26 Percent Reciprocal Tariff On India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు, భారత్ & చైనా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయని, దానికి ప్రతీకార చర్యగా టారిఫ్ యాక్షన్ తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. టారిఫ్‌లు అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 02వ తేదీని అమెరికా విమోచన దినోత్సవంగా అభివర్ణించారు. విమోచన దినోత్సవం ప్రసంగంలో ప్రతీకార సుంకాల చార్ట్‌ను ప్రదర్శించిన ట్రంప్, భారతీయ ఉత్పత్తుల 26% శాతం టారిఫ్‌లు విధించారు. చైనా వస్తువులపై 34%, యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతులపై 20%, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25%, జపనీస్ వస్తువులపై 24%, తైవాన్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 32% ప్రతీకార సుంకాలు విధించినట్లు వెల్లడించారు.
వైట్ హౌస్ నుంచి చేసిన తన ప్రసంగంలో ట్రంప్ ఏమన్నారంటే? – “అమెరికన్ మిత్రులారా, ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న విముక్తి దినోత్సవం. ఏప్రిల్ 2, 2025 అమెరికన్ పరిశ్రమల పునర్జన్మకు గుర్తు. ఇప్పుడు, ‘మేక్ అమెరికా వెల్దీ ఎగైన్’ (MAKE AMERICA WEALTHY AGAIN) ప్రచారాన్ని తిరిగి ప్రారంభిస్తాం. ప్రపంచ దేశాలు అమెరికన్లను 50 సంవత్సరాలకు పైగా మోసం చేశారు. ఇకపై దానిని జరగనివ్వం“.
భారతదేశం గురించి ట్రంప్ ఏం చెప్పారంటే?
తన ప్రసంగంలో భారత్ గురించి కూడా అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు. అమెరికా పట్ల భారతదేశ వాణిజ్య వైఖరి చాలా కఠినంగా ఉందని ట్రంప్ అన్నారు. భారత ప్రధాని మోదీ గురించి చెబుతూ, మోదీ మనకు మంచి స్నేహితుడు అని అన్నారు. మోదీ మన స్నేహితుడే అయినప్పటికీ అమెరికాతో సానుకూలంగా వ్యవహరించడం లేదని ఆయనకు చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు.
“భారత్ మన నుంచి 52 శాతం పన్నులు వసూలు చేస్తోంది. చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా భారత్ నుంచి మనం ఏమీ వసూలు చేయలేదని మీరు అర్థం చేసుకోవాలి. ఏడు సంవత్సరాల క్రితం, నేను మొదటిసారి అమెరికాలో అధికారంలోకి వచ్చినప్పుడు, చైనాకు వ్యతిరేకంగా ప్రతీకార సుంకాలను ప్రారంభించాను” – డొనాల్డ్ ట్రంప్
ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల జాబితా:
1 – చైనా: 34%
2 – యూరోపియన్ యూనియన్: 20%
3 – దక్షిణ కొరియా: 25%
4 – భారతదేశం: 26%
5 – వియత్నాం: 46%
6 – తైవాన్: 32%
7 – జపాన్: 24%
8 – థాయిలాండ్: 36%
9 – స్విట్జర్లాండ్: 31%
10 – ఇండోనేషియా: 32%
11 – మలేషియా: 24%
12 – కంబోడియా: 49%
13 – యునైటెడ్ కింగ్‌డమ్: 10%
14 – దక్షిణాఫ్రికా: 30%
15 – బ్రెజిల్: 10%
16 – బంగ్లాదేశ్: 37%
17 – సింగపూర్: 10%
18 – ఇజ్రాయెల్: 17%
19 – ఫిలిప్పీన్స్: 17%
20 – చిలీ: 10%
21 – ఆస్ట్రేలియా: 10%
22 – పాకిస్తాన్: 29%
23 – టర్కీ: 10%
24 -శ్రీలంక: 44%
25 – కొలంబియా: 10%
భారతదేశంపై సుంకాల ప్రభావం ఎంత?
* ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల భారత్‌కు సంవత్సరానికి $7 బిలియన్ల నష్టాలు సంభవించవచ్చని సిటీ రీసెర్చ్ నివేదిక కొన్ని రోజుల క్రితం హెచ్చరించింది.
* రసాయనాలు, లోహ ఉత్పత్తులు, ఆభరణాలు, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఆహార పదార్థాల రంగాలు ప్రభావితం అవుతాయి.
* 2024లో, భారత్ అమెరికాకు $74 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. వాటిలో – ముత్యాలు, విలువైన రాళ్ళు, ఆభరణాలు దాదాపు $8.5 బిలియన్లు కాగా, ఔషధాలు $8 బిలియన్లు, పెట్రోకెమికల్స్ దాదాపు $4 బిలియన్లు.
* మోర్గాన్ స్టాన్లీ ప్రకారం, అతి పెద్ద ప్రభావం ఔషధాల రంగంపై ఉంటుంది, మొత్తం ఎగుమతుల్లో దీనిది 2.8% వాటా & GDPలో 0.3% వాటా. వ్యవసాయం, విలువైన రాళ్ళు, రసాయనాలు, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు కూడా ప్రభావితమవుతాయి.
* గత సంవత్సరం, భారతదేశం నుంచి ఎగుమతి అయిన ప్రాసెస్డ్ ఫుడ్ & చక్కెర వంటి ఉత్పత్తుల విలువ $1.03 బిలియన్లు. ఈ రంగాల్లో 24.99 శాతం సుంకాల వ్యత్యాసం ఉంది & ఈ రంగాలపై ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.
మరిన్ని చూడండి