Trunkless Elephant Calf Stumps Forest Officers In Kerala

Trunkless Elephant: ఏనుగుకు అందం భారీ కాయం, చాటడంత చెవులు, ఘీంకరించే తొండం. దీని పొడవు ఎనిమిది అడుగులకు పైగా ఉంటుంది. తొండంలో దాదాపు 40 వేల కండరాలు ఉంటాయట. ఏనుగు తొండంతో సులువుగా 300 కేజీలను ఎత్తగలదట. సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. పెద్ద దుంగలను సులువుగా తరలిస్తుంది. అంతేకాదు కార్లు, ఇతర వాహనాలను అవలీలగా ఎత్తిపడేస్తుంది. అలాంటి తొండం ఏనుగుకు లేకపోతే ఎలా ఉంటుంది? అసలు ఏనుగుగా గుర్తించగలగుతామా?

ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన కేరళలో జరిగింది. అతిరప్పిల్లిలోని దట్టమైన అడవులలో అటవీ అధికారులు తొండం లేని ఏనుగు పిల్లను గుర్తించారు. కేరళ, తమిళనాడు మధ్య సంచరిస్తున్న ఏనుగుల గుంపును పర్యవేక్షిస్తున్న అధికారులు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. తరువాత గున్న ఏనుగు ఆరోగ్యం కదలికలను నిశితంగా పరిశీలించారు. అనంతరం తొండం లేని ఏనుగు గురించి మాట్లాడుతూ.. ఏనుగులు నీటి కోసం వెళ్లినప్పుడు మొసలి దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని, అలాగే ఎత్తైన పదునైన ఫెన్సింగ్ మెటల్ వైర్లు తగలడం ద్వారా ఏనుగుల తొండాలు తెగిపోయే అవకాశం ఉందన్నారు. ఇటీవల తొండం లేకుండా గుర్తించిన మొదటి కేసు అని బృందంలోని ఒక అధికారి తెలిపారు.

ఏనుగులు తినడానికి, తాగడానికి, సాంఘికంగా ఉండటానికి తొండం అవసరం ఉంటుంది. అయితే గున్న ఏనుగుకు తొండం లేకపోవడం దాని మనుగడపై ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏనుగు పిల్ల వయస్సుకు తగ్గట్టుగానే ఆరోగ్యంగా ఉందన్నారు. దానిని సంరక్షణ శిబిరానికి తరలించాల్సిన అవసరం లేదన్నారు. తదుపరి పరిశీలన తర్వాత నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. 

ఏడు నెలల క్రితం చూసినప్పుడు ఈ చిన్న ఏనుగుకు ఎలాంటి సమస్యలు లేవని అటవీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం దాని వయసు దాదాపు నాలుగేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ఏనుగులను అధికారులు నాలుగు సార్లు పరిశీలించారు. అయితే ఈ సారి గున్న ఏనుగు చాలా బలహీనంగా ఉందని వివరించారు. సాధారణంగా తల్లి ఏనుగులు పిల్ల ఏనుగులకు నాలుగు నుంచి ఐదు ఏళ్ల వరకూ పాలు ఇస్తాయని, అసాధారణ పరిస్థితుల్లో పాలు ఇవ్వడం ఆపేస్తాయని తెలిపారు. అయితే తొండం లేని పిల్ల ఏనుగు ఆహారం లోపంతో బలహీనంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మామూలుగా వయోజన ఏనుగులు వికలాంగులను వదిలిపెట్టవని, కాలక్రమేణా పరిమితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాయని ఫారెస్ట్ గార్డులు చెబుతున్నారు. 

ఇతర జంతువుల మాదిరి ఈ గున్న ఏనుగు అడవిలోని ఆహారాన్ని తినలేకపోతుంది. గడ్డి మాత్రమే తింటోంది. భవిష్యత్తులో మరింత సమస్యాత్మకం కానుంది. అది మగ ఏనుగు అయితే, దాని జీవితం కఠినంగా ఉంటుంది. ఈ విషయం ఏనుగు ప్రియులను ఆందోళన కలిగిస్తోంది. తొండం పైభాగంలో కోత గుర్తు ఉందని, అది పుట్టుకతో వచ్చిందా, ఏదైనా ప్రమాదం జరిగిందా తెలియాల్సి ఉందని అటవీ అధికారులు తెలిపారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Source link