UK Indian Origin Man Died In London Aravind Sasikumar From Kerala Stabbed To Death In London

Indian Killed In London: లండన్ లో హైదరాబాద్ విద్యార్థిని బ్రెజిలియన్ దారుణంగా హత్య చేసిన ఘటన మరవక ముందే మరో హత్య కలకలం రేపింది. లండన్ లో మరో భారతీయ సంతతి వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు. కేరళలోని పనంపల్లికి చెందిన అరవింద్ శశికుమార్ (38) ను తనతో పాటు ఫ్లాట్ లో అద్దెకు ఉండే మరో భారత సంతతి వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అరవింద్ శశికుమార్ పదేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై బ్రిటన్ కు వెళ్లాడు. అతడు లండన్ లోని కాంబెర్ వెల్ ప్రాంతంలో అ ఫ్లాట్ లో అద్దెకు దిగాడు. తనతో పాటు అదే ఫ్లాట్ లో కొందరు కేరళ వ్యక్తులు కూడా ఉంటున్నారు. అయితే శుక్ర వారం రాత్రి అరవింద్ శశికుమార్ కు, రూములో తనతో పాటూ ఉండే సల్మాన్ సలీమ్ కు మధ్య మాటా మాటా పెరిగింది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో సల్మాన్ సలీమ్ దగ్గరలో ఉన్న కత్తి తీసుకుని అరవింద్ శశికుమార్ ను దారుణంగా పొడిచి చంపాడు. 

ఛాతిపై బలంగా కత్తితో దాడి, తీవ్ర రక్తస్రావమై మృతి

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భవంతి మెట్ల వద్ద అరవింద్ తీవ్ర గాయాలతో కనిపించాడు. అప్పటికే తీవ్రంగా రక్తపోయింది. పోలీసులతో పాటు వచ్చిన వైద్య సిబ్బంది అరవింద్ ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అక్కడికక్కడే అరవింద్ ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు. ఛాతిపై బలమైన కత్తిపోట్ల కారణంగానే తీవ్ర రక్తస్రావమై అరవింద్ ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టు మార్టం రిపోర్టులో వెల్లడైంది. ఈ మేరకు స్థానిక పోలీసులు నిందితుడు సల్మాన్ సలీమ్ ను అరెస్టు చేశారు. అరవింద్, సల్మాన్ గొడవ పడుతున్నప్పుడు పక్కనే ఉండి చూసిన మరో ఇద్దరు కేరళ వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

తేజస్విని చంపిన బ్రెజిల్ వ్యక్తి

ఉన్నత చదువుల కోసం లండన్‌లో ఉంటున్న రంగగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతిని బ్రెజిల్‌కు యువకుడు హత్య చేశాడు. మూడ్రోజుల క్రితం జరిగిన ఈ దుర్ఘటన చర్చనీయాంశంగా మారింది. బ్రాహ్మణపల్లికి చెందిన  27 ఏళ్ల తేజస్విని రెడ్డి లండన్‌లో ఎంఎస్‌ చేస్తున్నారు. జూన్ 13, మంగళవారం 09:59 గంటలకు వెంబ్లీలోని నీల్డ్ క్రెసెంట్‌ లోని రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఈ దాడి జరిగింది. బ్రెజిలియన్ యువతీ యువకులు ఇద్దరు భారత సంతతి యువతులపై కత్తులతో దాడి చేశారు. వీరి దాడిలో తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అఖిల తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. తేజస్విని మరణ వార్త గురించి తెలుసుకున్న హైదరాబాద్ చంపాపేటలో ఉంటున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తేజస్విని, అఖిలపై బ్రెజిలియన్ యువతీ యువకులు ఎందుకు దాడి చేశారనే కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ హత్యా ఘటనపై నిజానిజాలు వెలికి తీస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 

Source link