Union Minister Gadkari reveals shocking news he said Rs 300 crore earnings per year from toilet water

Wastewater Treatment Project In Nagpur: కేంద్ర రోడ్డు రవాణా & నౌకా రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఓ షాకింగ్‌ విషయం చెప్పి దేశవ్యాప్తంగా జనాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. నిజానికి, కేంద్ర మంత్రి ఒక ప్రత్యేకమైన ఆదాయ వనరు గురించి చెప్పారు. గురువారం, టైమ్స్ నౌ సమ్మిట్ 2025లో మాట్లాడిన గడ్కరీ, తన పార్లమెంటరీ నియోజకవర్గం నాగ్‌పుర్‌ గురించి చెప్పారు. టాయిలెట్ వాటర్‌ అమ్మి ఏటా రూ. 300 కోట్లు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు.

మధురలో వ్యర్థ జలాల శుద్ధి ప్రాజెక్టు
గతంలో, తాను కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఒక ప్రాజెక్టును ప్రారంభించానని నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా, ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి ‍‌(Wastewater treatment) చేసి మధుర రిఫైనరీకి విక్రయించారు. ఈ ప్రాజెక్టులో 40 శాతం ప్రభుత్వం & 60 శాతం ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టారు. అంటే, ఇది PPP మోడల్‌ ప్రాజెక్ట్‌. ఆ తరువాత, ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు (Liquid waste management project) విజయవంతమైందని గడ్కరీ తెలిపారు.

దేశంలోని ప్రతి నగరంలో…
అదేవిధంగా, నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ (Nagpur Municipal Corporation) కూడా టాయిలెట్ వాటర్ అమ్ముతోందని నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఇలా, టాయిలెట్ వాటర్ అమ్మడం ద్వారా ప్రభుత్వం సంవత్సరానికి రూ. 300 కోట్లు సంపాదిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. వ్యర్థ జలాలను రీసైకిల్ ‍‌(Recycling waste water) చేసి ఉపయోగించడం ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ (Solid waste management) & ద్రవ వ్యర్థాల నిర్వహణ (Liquid waste management) లాభదాయకమైన విధానంగా మారుతుందని, దేశంలోని ప్రతి నగరంలో దీనిని అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు.

భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్
భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్ (Hydrogen) అని చెప్పిన గడ్కరీ, ఘన వ్యర్థాల నిర్వహణ నుంచి హైడ్రోజన్ తయారు చేస్తారని వెల్లడించారు. ఘన వ్యర్థాల నుంచి గాజు, లోహాలు, ప్లాస్టిక్‌ను వేరు చేసి రీసైకిల్ చేస్తారని చెప్పారు. అదనంగా, సేంద్రీయ వ్యర్థాలను బయోడైజెస్టర్‌లో వేయడం ద్వారా దాని నుంచి మీథేన్ విడుదల అవుతుందన్నారు. మీథేన్‌కు కార్బన్ డై ఆక్సైడ్‌ (CO2)ను జోడించడం ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఆ హైడ్రోజన్‌ను వాహనాల ఇంధనంగా ఉపయోగించుకోవడంతో పాటు ఇంకా వివిధ మార్గాల్లో వినియోగించుకోవచ్చన్నారు.

ఏటా రూ. 22 లక్షల కోట్లు ఆదా చేయవచ్చు
ఘన వ్యర్థాలు, బయోమాస్‌ నుంచి తక్కువ ఖర్చుతో హైడ్రోజన్‌ను విజయవంతంగా ఉత్పత్తి చేస్తే, ఏదో ఒక రోజు భారతదేశం ఇంధన ఎగుమతి దేశంగా అవతరిస్తుందని గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం, భారతదేశం తన ఇంధన (ముడి చమురు) అవసరాల్లో దాదాపు 85 శాతాన్ని దిగుమతుల ద్వారానే పొందుతోంది. అంటే, ఇంధన దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడుతున్న దేశం మనది. ముడి చమురు లాంటి శిలాజ ఇంధనాల కోసం ఏటా రూ. 22 లక్షల కోట్లను భారత్‌ ఖర్చు చేస్తోంది. మన అవసరాలకు సరిపడా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయగలిగితే, ఈ డబ్బంతా మిగులుతుంది.

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link