Pegasus Spyware Probe: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్‌నకు ఉపశమనం కలిగేలా యూఎస్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వాట్సాప్ యూజర్ల డివైజ్‌లలో అక్రమంగా పెగాసస్ స్పైవేర్‌ను చొప్పించిందనే ఆరోపణలపై ఇజ్రాయెల్ (Israel)కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులతో సహా 14 మంది భారతీయులపై గూఢచర్యం చేయడానికి సాఫ్ట్‌వేర్ ఉపయోగించినట్టు దర్యాప్తు పూర్తయిన నెలల తర్వాత ఈ తీర్పు వచ్చింది. 2019లో మెటా సంస్థ ఈ కేసును కోర్టులో దాఖలు చేసింది. వాట్సాప్‌లోని బగ్‌ను ఉపయోగించి, యూజర్ల డివైజ్‌లలో పెగాసస్ స్పైవేర్‌ను చొప్పించిందని మెటా ఆరోపించింది. ఈ సందర్భంగా జరిగిన కోర్టు విచారణలో ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ సంబంధిత చట్టాలను ఉల్లంఘించిందని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మెటా సంస్థ స్వాగతించగా, ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
స్పైవేర్ పరిశ్రమలకు చెంపపెట్టు లాంటి తీర్పు
కెనడా ఇంటర్నెట్ వాచ్‌డాగ్ సిటిజన్ ల్యాబ్ సీనియర్ రిసెర్చర్ జాన్ స్కాట్ రైల్టన్ మాట్లాడుతూ.. ఇది స్పైవేర్ పరిశ్రమలకు చెంపపెట్టు లాంటి చారిత్రాత్మక తీర్పుని వ్యాఖ్యానించారు. తమ యూజర్ల మొబైల్ ఫోన్లలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతి లేకుండా 6 నెలల ముందు సర్వర్‌లను యాక్సెస్ చేసిందని ఆరోపిస్తూ, 2019లో వాట్సాప్ ఎన్‌ఎస్‌ఓపై కేసు వేసింది. పెగాసిస్‌ను పూర్తిగా నిషేధించాలని, నష్టపరిహారం కూడా చెల్లించాలని కోరింది. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, అసమ్మతివాదులతో సహా 1,400 మంది వ్యక్తులపై నిఘా ఉంచేందుకు ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. అయితే, జాతీయ భద్రత, నేరాల నుంచి రక్షణ కోసం చట్టబద్ద సంస్థలు, నిఘా వర్గాలకు పెగాసిస్ సాయం చేస్తుందని ఎన్ఎస్ఓ వాదించింది.
ఈ కేసుపై 2020లో ట్రయల్ కోర్టు నిరాకరించడంతో ఎన్ఎస్ఓ ఇమ్యూనిటీకి అప్పీల్ కు వెళ్లింది. అక్కడ అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. శాన్‌ఫ్రాన్సిస్కో 9 యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ 2021లో కింద కోర్టు తీర్పును సమర్దించింది. కేవలం పెగాసస్‌కు లైసెన్స్ ఇవ్వడం, సాంకేతిక మద్దతును అందించడం వల్ల ఫెడరల్ చట్టం నుంచి రక్షణ పొందలేదని స్పష్టం చేసింది. విచారణ నిలిపివేయాలని ఎన్ఎస్ఓ చేసిన అప్పీల్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
తీర్పుపై వాట్సాప్ చీఫ్ విల్ కాథ్‌కార్ట్ స్పందిస్తూ.. ఇది గోప్యతకు దక్కిన విజయమని అన్నారు. ఈ కేసులో తాము ఐదేళ్ల పాటు పోరాటం చేశామని చెప్పారు. స్పైవేర్ కంపెనీలు చట్టవిరుద్ధమైన చర్యలకు జవాబుదారీగా ఉండవని మేము బలంగా విశ్వసించామని, మా వాదనలను సమర్పించడానికి ఐదేళ్లు పట్టిందని ఆయన అన్నారు. మరోపక్క సైబర్ సెక్యూరిటీ నిపుణులు సైతం స్వాగతించారు.
కోర్టు తీర్పు తర్వాత ప్రధాని మోదీపై కాంగ్రెస్ విమర్శలు
గూఢచర్యం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని ‘హైజాక్’ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. “అమెరికాలో పెగాసస్ గూఢచర్యం బట్టబయలైంది. ఇప్పుడు పెగాసస్ స్పైవేర్ కేసులోని తీర్పు అక్రమ స్పైవేర్ రాకెట్‌లో 300 మంది భారతీయులను ఎలా లక్ష్యంగా చేసుకున్నదో ఇది రుజువు చేస్తుంది” అని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘భారతదేశంలో కూడా సత్యాన్ని దాచలేం. మోదీ ప్రభుత్వం గూఢచర్యం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసిందనేది నిజం’ అన్నారాయన.
The #PegasusSpyware case verdict proves how 300 what’sapp numbers of Indians were targeted in the illegal spyware racket.
Time for Modi Govt to answer :
👉 Who are the 300 names targeted ! Who are the two Union Ministers? Who are the three Opposition leaders? Who is the…
— Randeep Singh Surjewala (@rssurjewala) December 22, 2024
2021లో, మోదీ ప్రభుత్వం జర్నలిస్టులను, ప్రతిపక్ష రాజకీయ నాయకులను 1,000కు పైగా భారతీయ ఫోన్ నంబర్‌లలో స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసినట్టు చూపించే లీకైన పత్రాలతో కూడిన కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పెగాసస్‌ను ఉపయోగించిందని సూర్జేవాలా ఆరోపించారు. అలా లక్ష్యంగా చేసుకున్న వారిలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. స్పైవేర్ ద్వారా టార్గెట్ చేసిన 300 మంది పేర్లకు సమాధానం చెప్పాలని మోదీ ప్రభుత్వాన్ని సూర్జేవాలా కోరారు. పెగాసస్‌చే లక్ష్యంగా చేసుకున్న భారతీయుల పేర్లను కూడా విడుదల చేయాలని అతను మెటాకు పిలుపునిచ్చారు.
Also Read : Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
మరిన్ని చూడండి