US News: ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లపై ధరల పిడుగుపడబోతోంది. కొత్త అధ్యక్షుడు తీసుకున్న ప్రతీకార సుంకాల కారణంగా కొన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇది అమెరికన్ల జీవన ప్రమాణంపై ప్రభావం చూపబోతోంది. 2 ప్రతికార సుంకాలు అమలులోకి వచ్చిన ఏప్రిల్‌ 2న "లిబరేష్ డే" అని ట్రంప్ పేరు పెట్టారు. ఆ రోజు నుంచి అమెరికా, విదేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత తొలగేందుకు మార్గం సుగమమైందని ట్రంప్‌ విశ్వసిస్తున్నారు. కానీ కథ వేరే ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పన్నుల భారం వస్తువులు ఎగుమతి చేసే దేశాలు భరిస్తాయని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నప్పటికీ దాని ప్రభావం కూడా ప్రజలపై ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఎక్కువ ధరకు వస్తువులను దిగుమతి చేసేకునే వాల్మార్ట్, అమెజాన్ వంటి యుఎస్ దిగుమతిదారులు వాటి భారాన్ని ప్రజలపై వడ్డిస్తారు. దీని వల్ల వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది.

బుధవారం నుంచి ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త సుంకాల్లో 10% సార్వత్రిక సుంకంతోపాటు యుఎస్‌తో వాణిజ్య భాగస్వాములుగా ఉన్న 60 దేశాలపై రెసిప్రోకల్‌ టారిఫ్స్‌ అని పిలిచే సుంకాలు విధిస్తున్నారు. అన్ని దేశాలపై 10% సార్వత్రిక సుంకం ఉంటూనే మళ్లీ ఆయా దేశాలను లక్ష్యంగా చేసుకునే నిర్దిష్ట దిగుమతి సుంకాలు వేయనున్నారు. అంటే రెండు విధాలుగా పన్నుల భార పడనుంది.

ఇలా విధించిన సుంకాల వల్ల అమెరికన్లు లాభపడతారని ట్రంప్‌ భావిస్తున్నారు. ధరలు తగ్గుతాయని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించాలని కోరుకుతున్నారు. కానీ వినియోగదారులు, వ్యాపారాలు అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కాఫీ, చాక్లెట్ వంటి ఆహార దిగుమతుల నుంచి ఐఫోన్‌లు, US వెలుపల తయారయ్యే ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ వరకు ప్రతిదానిపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

ఇది ‘స్వర్ణయుగం’ అంటూ పదే పదే ట్రంప్ చెబుతున్నప్పటికీ భారీ పన్ను పెరుగుదల అమెరికన్ కుటుంబాలకు పెద్ద షాక్‌గా అభివర్ణిస్తున్నారు ఆర్థికశాస్త్రవేత్తాలు. అధిక ధరలు, స్వల్ప వృద్ధి, వ్యాపార పెట్టుబడి, ఎగుమతులు, తయారీ ఉత్పత్తి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తయారు అయ్యే ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతాయని వాటిపై కూడా ప్రభావం ఉంటుందని అంటున్నారు. విదేశాలు ప్రతీకార చర్యలు తీసుకుంటే పరిస్థితి ఆందోళనకరంగా తయారు అవుతుందని అంటున్నారు. ఇది US టారిఫ్స్‌ 1930 స్మూట్-హాలీ టారిఫ్ చట్టం తర్వాత కనిపించని స్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపించేదిగా చెబుతున్నారు. ఆర్థిక మాంద్యాన్ని తీవ్రతరం చేస్తుందని ఆవేదన చెందుతున్నారు.

సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, క్లిష్టమైన మినరల్స్‌సహా సుంకాలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఉత్పత్తులపై భవిష్యత్‌లో టారిఫ్స్‌ పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

సుంకాలతో ఏ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి?

దిగుమతులపై 10% జనరల్‌ టారిఫ్‌తో అమెరికన్ కంపెనీలు దిగుమతి వస్తువుల ధరలు సర్దుబాటు చేస్తే మరికొద్ది రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. టారిఫ్స్‌తో లక్ష్యంగా చేసుకున్న దేశాల్లో చైనా, తైవాన్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఇవి ఆపిల్ ఐఫోన్‌ల నుంచి టెలివిజన్ సెట్‌ల వరకు అమెరికాకు ఎలక్ట్రానిక్స్‌ను ఎగుమతి చేసే అగ్ర దేశాలు. వాటి ధరలు పెరుగుతాయి. చైనాపై 34% టారిఫ్ వేయాలని చూస్తోంది. ఏప్రిల్ 9 నుంచి లెవీలు అమల్లోకి వచ్చిన వెంటనే అక్కడ తయారు చేసి USకు దిగుమతి అయ్యే ఉత్పత్తుల ధరలు అమాంతం పెరుగుతాయి.

కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ప్రకారం… దాదాపు అన్ని ఐఫోన్‌లు ఇప్పటికీ చైనాలోనే తయారు అవుతున్నాయి. ఈ మధ్య కాలలంలోనే ఆపిల్ తన ఐఫోన్ తయారీలో కొంత భాగాన్ని భారత్‌కి మార్చింది. అయితే, భారత్‌పై కూడా 26% పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐఫోన్ల ధరలు మరింత పెరగనున్నాయి.

ఆటోమొబైల్స్
ఆటో దిగుమతులపై ట్రంప్ గతంలో ప్రకటించిన 25% సుంకంతో పాటు, దిగుమతి చేసుకున్న వస్తువులపై కూడా 10% జనరల్ టారిఫ్‌ వేస్తున్నారు. కొన్ని US-నిర్మిత వాహనాల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉన్నాయి. వీటిపై టారిఫ్ ప్రభావం పడుతుంది. దీంతో ఆ కార్ల కొనుగోలు ధర పెరుగుతుందని నిపుణులు తెలిపారు. అమెరికన్లు వినియోగించే అత్యల్ప ధర కలిగిన అమెరికన్ కార్లకు అదనంగా $2,500 నుంచి $5,000 వరకు, కొన్ని దిగుమతి చేసుకున్న మోడళ్లకు $20,000 వరకు చెల్లించాల్సి రావచ్చు.

దుస్తులు, బూట్లు
వాల్‌మార్ట్ వంటి US స్టోర్‌ల్లో విక్రయించే దుస్తులు, బూట్లలో ఎక్కువ భాగం US వెలుపల చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లో తయారైనవే. ఈ మూడు దేశాలు కూడా సుంకాలు ఎదుర్కొంటాయి. చైనాకు 34%, వియత్నాంకు 46%, బంగ్లాదేశ్‌కు 37% టారిఫ్ విధించారు. వీటి ధరలు కూడా పెరగనున్నాయి.

వైన్, స్పిరిట్స్
ఇటాలియన్, ఫ్రెంచ్ వైన్లు, స్కాటిష్ విస్కీ కూడా ధర పెరిగే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్ దేశాల దిగుమతులు 20% టారిఫ్‌ను ఎదుర్కొంటాయి. యునైటెడ్ కింగ్‌డమ్ ఉత్పత్తులు 10% దిగుమతి సుంకాన్ని ఎదుర్కొంటాయి.

ఫర్నిచర్
CNBC ప్రకారం… USలో అమ్మకానికి ఉన్న ఫర్నిచర్‌లో దాదాపు 30% నుంచి 40% ఇతర దేశాల్లో తయారైందే. USకు ఫర్నిచర్ ఎగుమతి చేసే అగ్ర దేశాల్లో చైనా మరియు వియత్నాం ఉన్నాయి.

కాఫీ, చాక్లెట్
బ్రెజిల్, కొలంబియా వంటి లాటిన్ అమెరికన్ దేశాల నుంచి 80% కాఫీ గింజలు దిగుమతి చేసుకుంటుంది. ఈ రెండు దేశాలను కూడా టారిఫ్‌ పరిధిలోకి తీసుకురావంతో ధరలు పెరగనున్నాయి. చాక్లెట్ మరొక ప్రధాన లాటిన్ అమెరికన్ దిగుమతి. ఎందుకంటే అమెరికా వాతావరణం కోకో గింజలు పెంచడానికి అనుకూలం కాదు. USDA ప్రకారం, దేశానికి కోకో గింజలను ఎగుమతి చేసే దేశాల్లో కోట్ డి ఐవోయిర, ఈక్వెడార్ ఉన్నాయి. ఆ దేశాలు వరుసగా 21%, 10% టారిఫ్‌ను ఎదుర్కొంటాయి.

స్విస్ గడియారాలు
యుఎస్‌కు స్విస్ దిగుమతులపై 31% టారిఫ్ పడుతోంది. ఇది స్వాచ్ వంటి బ్రాండ్‌ల నుంచి రోలెక్స్ వంటి తయారు చేసే ఖరీదైన టైమ్‌పీస్‌ల వరకు గడియారాల ధరలను ప్రభావితం చేస్తుంది.