Viral News Snake Bites Rajasthan Man He Survives Snake Bites Him Again After 5 Days Dies

Viral News: పాములు పగబడతాయా.. అదో మూఢనమ్మకం అనుకునే వారు కొందరు. నిజంగానే పాములు పగబడతాయని నమ్మేవారు కొందరు. ఎవరి నమ్మకాలు వారివి. పాములు పగబట్టడం అనే విషయాన్ని హేతువాదులు కొట్టిపారేస్తుంటారు. అదంతా మూఢనమ్మకమని, దాంట్లో నిజం లేదని అంటుంటారు. నమ్మకాలను విశ్వసించే వారు మాత్రం పాముల పగబడతాయని బలంగా నమ్ముతుంటారు. అయితే కొన్ని ఘటనలు జరిగినప్పుడు నిజంగానే పాములు పగబడతాయా అనే సందేహం తప్పకుండా వస్తుంది. అలాంటి ఓ ఘటన తాజాగా రాజస్థాన్ లో జరిగింది. 

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ జిల్లా మెహ్రాన్ గఢ్ గ్రామానికి చెందిన జసాబ్ ఖాన్ (44) అనే వ్యక్తి తాజాగా పాము కాటుకు గురయ్యి ప్రాణాలు వదిలాడు. అతనిపై పాము పగబట్టిందని స్థానికులు అంటున్నారు. అతడు చనిపోయే వరకు పాము తన వెంట పడిందని చెబుతున్నారు. వాళ్లు అలా ఎందుకు అంటున్నారంటే.. ఐదు రోజుల క్రితం జసాబ్ ఖాన్ ను పాము కాటు వేసింది. వెంటనే జసాబ్ ఖాన్ కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయగా.. అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేయగా అతడికి ప్రాణాపాయం తప్పింది. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చాడు. జూన్ 20వ తేదీన పాము కాటు వేయగా ఆస్పత్రిలోనే ఉండి రెండు, మూడ్రోజులకు ఇల్లు చేరాడు జసాబ్ ఖాన్. మొదటి పాము కాటు వేసిన ఐదు రోజుల తర్వాత జూన్ 26వ తేదీన మరోసారి జసాబ్ ఖాన్ ను పాము కాటు వేసింది. ఈసారి కూడా అతడిని కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే జోధ్ పూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. జసాబ్ ఖాన్ అక్కడ చికిత్స పొందతూ ప్రాణాలు కోల్పోయాడు. జసాబ్ ఖాన్ ను రెండు సార్లు వైపర్ రకానికి చెందిన ‘బండి’ అనే పాము కాటుకు గురయ్యాడు. ఈ రకం పాములు ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Also Read: Aspartame: WHO చెప్పిన అస్పర్టమే అంటే ఏంటి? దీంతో క్యాన్సర్ వస్తుందా? ఈ ఉత్పత్తుల్లోనే ఎక్కువ!

ఒకే చోట రెండుసార్లు పాము కాటు

జసాబ్ ఖాన్ ను వైపర్ ‘బండి’ పాము రెండు సార్లు ఒకే ప్రాంతంలో కాటు వేసింది. కాలి చీలమండపైనే పాము కాటేసింది. మొదటి సారి పాము కాటు నుంచి జసాబ్ ఖాన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా.. అతడు పూర్తిగా కోలుకోలేదని.. మరోసారి అదే ప్రాంతంలో అదే స్థాయి విషం ఉన్న పాము కాటు వేయడంతో ఆ విష ప్రభావాన్ని జసాబ్ ఖాన్ శరీరం తట్టుకోలేకపోయిందని అలా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెబుతున్నారు. ఈ విషాదకర ఘటనపై భనియానా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జసాబ్ ఖాన్ కు తల్లి, భార్య, నలుగురు కుమార్తెలు, 5 ఏళ్ల కుమారుడు ఉన్నారని స్థానికులు తెలిపారు. స్థానికులు మాత్రం ఆ పాము జసాబ్ ఖాన్ పై పగబట్టిందని అంటున్నారు. పగబట్టింది కాబట్టే.. జసాబ్ ఖాను రెండు సార్లు కాటు వేసిందని, ఒకే చోట రెండు సార్లు కాటు వేసిందని చెబుతున్నారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Source link