Viral Video Posing For Photo Turns Fatal As Woman Swept Away By Wave At Bandra Bandstand In Front Of Kid

Viral Video: 

ముంబయిలో ఘటన..

ఏదైనా టూరిస్ట్‌ ప్లేస్‌కి వెళ్లగానే అందరూ ముందుగా చేసే పని. జేబులో ఉన్న ఫోన్‌ తీసి చకాచకా ఫొటోలు తీయడం. ఆ తరవాత సెల్పీలు, వీడియోలు…అబ్బో నానా హడావుడి చేస్తారు. ఆ ప్లేస్‌ని కళ్లతో కాకుండా కెమెరా లెన్స్‌తో చూస్తారు. అక్కడితో ఆగకుండా వెంట వెంటనే ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. లైక్‌లు, కామెంట్స్ లెక్కలేసుకుంటూ కూర్చుంటారు. అదో ఆనందం. కానీ…ఈ ఆనందం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు కొందరు. రీల్స్‌ కోసం ప్రమాదకర స్టంట్‌లు చేస్తున్నారు. ఇలా అడ్వెంచర్‌లు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్లు చాలా మందే ఉంటున్నారు. ముఖ్యంగా నీళ్లతో ఆటలాడుతూ చివరకు ఆ నీళ్లలోనే బలి అవుతున్నారు. ముంబయిలోనే ఇలాంటి  ఘటనే జరిగింది. ఓ మహిళ తన భర్తతో పాటు కలిసి బీచ్‌లోని ఓ బండరాయిపై కూర్చుంది. ఆ సమయంలో వర్షం పడుతోంది. సముద్రపు అలలు ప్రమాదకరంగా ఎగిసిపడుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా ఆ భార్యాభర్తలు బండరాయిపై అలానే కూర్చుని ఫొటోలు తీయించుకున్నారు. అప్పుడే ముప్పు ముంచుకొచ్చింది.

మింగేసిన అల..

అమ్మనాన్న అలా ఆస్వాదిస్తుంటే పిల్లలు కాస్త దూరంగా నిలబడి వీడియో తీస్తున్నారు. కాసేపటి వరకూ ఆ నీళ్లలో తడుస్తూ ఆస్వాదించారు. ఆ తరవాతే మృత్యువు పెద్ద అల రూపంలో దూసుకొచ్చింది. వాళ్ల కూర్చున్న బండరాయిపైకి ఓ పెద్ద అల వచ్చి తాకింది. ఆ తాకిడిన తట్టుకోలేక మహిళ నీళ్లలో పడిపోయింది. పిల్లలు చూస్తుండగానే అందులో పడి కొట్టుకుపోయింది. అప్పటి వరకూ వీడియో తీస్తున్న చిన్నారులు గట్టిగా అరిచారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. అప్పటి వరకూ వీడియో తీసిన చిన్నారులు ఫోన్‌ పడేసి కేకలు వేశారు. అప్పటికే ఆ మహిళ నీళ్లలో పడి చాలా దూరం కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్‌ల నుంచి కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ కోసం ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని మండి పడుతున్నారు. 
 

Source link