Yagi Typhoon killed hundreds of people in Mynmar in Telugu News | Yagi Effect in Mynmar: సౌత్‌ఈస్ట్ ఏసియాపై యాగీ తైఫూన్ పంజా

Yagi Typhoon Mishap News: సౌత్‌ ఈస్ట్ ఏసియాలో యాగీ సృష్టించిన బీభత్సానికి మృతుల సంఖ్య 500 దాటింది. పదుల సంఖ్యలో  గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు నేల మట్టం అయ్యాయి. లక్షల్లో నిరాశ్రయులయ్యారు. సౌత్‌ఈస్ట్‌ ఏసియా దేశాలైన మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, లావోస్‌, వియత్నాం సహా చైనాపై కూడా యాగీ విరుచుకు పడింది. ముఖ్యంగా మయన్మార్, వియత్నాంలో ఈ తైఫూన్‌ బీభత్సం సృష్టించింది. మయన్మార్‌ తీరాన్ని గతవారం ఈ యాగీ తైఫూన్ తాకగా ఇప్పటికీ ఆ తుఫాను ప్రభావం నుంచి మయన్మార్‌ కోలుకోనే లేదు.

తుపాన్‌కు తోడైన రైనీ సీజన్‌ సృష్టించిన వరదలు సహా కొండ చరియలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లు కొట్టుకు పోయాయి. ఆ దేశంలో మూడేళ్ల క్రితం ప్రజాస్వామ్య సర్కార్‌ను సైన్యం కూలదోసినప్పటి నుంచి అక్కడ అంతర్యుద్ధం రాజుకొని ఉంది. ఈ కారణంగా మృతులు, బాధితుల సంఖ్యలో సరైన లెక్కలు తెలియడానికి సమయం పడుతోంది. ఇప్పటి వరకూ మయన్మార్‌లో 226 మందిని యాగీ తుపాను పొట్టన పెట్టుకోగా మరో 77 మంది గల్లంతయ్యారు. 2 లక్షలా 40 వేల మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లు దెబ్బ తిన్నాయి. లక్షల ఎకరాల్లో పంటనష్టం ఏర్పడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోవడం సహా అంతర్యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో బాధితులకు సరైన సహాయం అందడం లేదు.

యాగీ తొలి దెబ్బ వియత్నాంపైనే.. తర్వాత మయన్మార్‌లో విలయం:

          తొలుత వియత్నాంను తాకిన యాగీ తుపాను అక్కడ 300 మందిని బలి తీసుకుంది. ఆ తర్వాత థాయిలాండ్‌లో 42 మందిని లావోస్‌లో నలుగురిని ఫిలిప్పీన్స్‌లో 21 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. మరో 26 మంది గల్లంతయ్యారు. మయన్మార్ సర్కార్ 2న్నర లక్షల మంది నిరాశ్రయులు అయినట్లు చెబుతున్నప్పటికీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఆ ఒక్క దేశంలోనే యాగీ బాధితులు 6 లక్షలా 31 వేల మంది ఉన్నట్లు వెల్లడించింది. వీరికీ తోడు మరో మూడున్నర మిలియన్ల మంది సెప్టెంబర్‌లోనే అంతర్యుద్ధానికి భయపడి యూఎన్ రెఫ్యూజీ క్యాంప్‌నకు చేరినట్లు ఐరాస పేర్కొంది. మాండలాయ్‌, మాగ్వే, బాగో, అయేయేవార్ డెల్టా పరివాహకంలో పరిస్థితి భయానకంగా మారినట్లు చెప్పింది. లక్షా 60 వేల ఇళ్లు కూలిపోయాయని విపత్తు నిర్వహణ పరిశీలకులు తెలిపారు. వందలాది పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, అనేక ప్రార్థనా మందిరాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. 6 లక్షలా 40 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా .. లక్షా 30 వేల పశువులు మృత్యువాత పడ్డాయి. 2008లో నర్గీస్ తుఫాను విసిరిన జలఖడ్గం ధాటికి దాదాపు లక్షా 38 వేల మంది మియన్మార్‌లోని ఇర్రావాడి నదీ పరివాహకంలో మృత్యువాత పడగా.. వారికి సహాయం చేయడంలో సైన్యం ఆలస్యం చేసినట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

సౌత్‌ఈస్ట్ ఏసియాకు భారత్‌ ఆపన్న హస్తం:

            యాగీ విలయంలో సర్వం కోల్పోయిన మయన్మార్‌, వియత్నాం, లావోస్ దేశాలకు అండగా నిలిచేందుకు భారత్‌ ఆపన్న హస్తం చాచింది. సద్భావ్ పేరిట ఆ దేశాలకు విపత్తు నిర్వహణ సామగ్రిని పంపుతోంది. ఈ కార్యక్రమంలో నేవీ, ఎయిర్‌ఫోర్స్ భాగమయ్యాయి. ఇప్పటికే ఒక షిప్‌ ఆహారం సహా ఇతర సామగ్రితో మయన్మార్‌కు వెళ్లగా మరో షిప్‌ కూడా ఆహారంతో సౌత్‌ ఈస్ట్ ఏసియాకు వెళ్తోంది. IAF ఎయిర్‌ క్రాఫ్ట్‌ ద్వారా 32 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌తో పాటు 10 టన్నుల రేషన్ తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని చూడండి

Source link