Online Job Fraud: మహబూబాబాద్ జిల్లాలో కూడా ఆన్‌లైన్ మోసం వెలుగు చూసింది. టాస్క్ బేస్డ్ జాబ్ పేరుతో ఓ యువకుడికి యువతి డీపీతో ఉన్న గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాము పంపిన యూ ట్యూబ్ లింక్స్ ని లైక్ అండ్ షేర్ చేసి, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ పంపిస్తే డబ్బులు చెల్లిస్తామని ఆ మెసేజ్ సారాంశం కాగా, సదరు యువకుడు అందుకు ఒప్పుకున్నాడు.
ఈ మేరకు కొద్ది రోజుల కిందట అదే గుర్తు తెలియని నెంబర్ నుంచి యూ ట్యాబ్ ఛానల్ లింక్స్ రాగా, వాటిని లైక్ కొట్టి, షేర్ చేశాడు. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా ఆ నెంబర్ కు పంపించాడు. ఇలా మూడు సార్లు మూడు టాస్క్ లు పూర్తి చేయగా.. ఒక్కోదానికి రూ.50 చొప్పున రూ.150 చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు ఆ సంస్థ నుంచి టెలి గ్రామ్ లింక్ ను పంపించి, దాని ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు.
ఈ మేరకు ఆ యువకుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు విత్ డ్రా కాలేదు. దీంతో మళ్లీ వారిని సంప్రదించగా.. కొంత మొత్తాన్ని తమ సంస్థకు జమ చేయాలని, అలా చేస్తే చివరలో పూర్తి డబ్బులు వస్తాయని నమ్మబలికారు. ఈ మేరకు ఆయన విడతల వారీగా మొత్తంగా రూ.12 లక్షల వరకు సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపించాడు.
చివరకు మొత్తం డబ్బులు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో మోసపోయానని భావించిన సదరు యువకుడు వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేసి సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. ఇదిలాఉంటే కొద్ది రోజుల కిందట ఇదే తరహా టాస్క్ బేస్డ్ ఫ్రాడ్ లో భాగంగా మరో వ్యక్తి దాదాపు రూ.32 లక్షల వరకు పోగొట్టుకోవడం గమనార్హం.
నెలకు వెయ్యికి పైగా మోసాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటికేడు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పెట్టుబడులు, పార్ట్ టైం జాబ్స్, టాస్క్ ల పేరున నెలకు వెయ్యి మందికిపైగానే మోసాల బారిన పడుతున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి దుండగులు ఇలాంటి నేరాలకు పాల్పడుతుండగా ఎంతోమంది అమాయకులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
కాగా వివిధ కారణాల వల్ల పోలీసులు రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ మోసం జరిగిన ఘటనల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుండటం గమనార్హం. కొంతమంది తక్కువ అమౌంట్ కు ఫిర్యాదు చేయడం ఎందుకని లైట్ తీసుకుంటుండగా, మరికొందరు పెద్ద మొత్తంలో పోగొట్టుకున్నా పరువు పోతుందనే ఉద్దేశంతో కంప్లైంట్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా పెద్ద ఎత్తున సైబర్ నేరాలు నమోదవుతున్నా, ఆఫీసర్ల లెక్కల్లో మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి.
తలమునకలవుతున్న పోలీసులు
ప్రజల స్వీయ తప్పిదాలు, సైబర్ నేరగాళ్ల చాకచక్యంతో ఆన్ లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన ఐదేండ్లలో పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన కేసులే 2500కు పైగా ఉండగా, కేసులు కాకుండా వదిలేసిన అంతకు 10 రెట్లు ఎక్కువగానే ఉంటాయని అంచనా.
ఈ పోలీసులు కేసులు ఫైల్ చేసిన ఘటనల్లో దాదాపు రూ.45 కోట్లకుపైగానే బాధితులు కోల్పోగా, సైబర్ నేరగాళ్ల నుంచి రికవరీ చేసింది మాత్రం రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల మధ్యలోనే ఉండటం గమనార్హం. జనాల ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్ దుండగులు వెనువెంటనే ఖాతాలు మారుస్తుండటంతో రికవరీ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పోలీస్ అధికారులు చెబుతుండటం గమనార్హం.
1930 నెంబర్ కు కాల్ చేయండి
ఒకవేళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లయితే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాల్సిందిగా పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేసినా సరిపోతుందని చెబుతున్నారు. ప్రజల స్వయం తప్పిదాల వల్లే సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతుండగా, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. జనాలు అవగాహనతో మెలగాలని, లేదంటే సైబర్ నేరగాళ్లు ఖాతాలు కొల్లగొట్టే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)Hty