CPI Naranayana : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీఏతో కలవడం బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మతవాద పార్టీ అయిన బీజేపీతో పవన్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. పవన్ నిలకడలేని వ్యక్తి అంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని ఎన్డీఏకు దగ్గర చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీని దగ్గర చేసేందుకు పవన్ దళారీ అవతారమెత్తారని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ కలిస్తే… ఏపీలో వైసీపీ గెలవడం ఖాయమని సీపీఐ నారాయణ జోస్యం చెప్పారు. రెండు పార్టీల్ని పవన్ కలిపితే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అన్నారు. పవన్ కల్యాణ్… చేగువేరా నుంచి సావర్కర్ వైపు ప్రయాణించడం శోచనీయమన్నారు. విప్లవ వీరుడు చేగువేరా తరహాలో టీ షర్టులు వేసుకుని, సోషలిజంపై గళం విప్పిన పవన్… ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కార్ వైపు దారి తప్పి నడవడం సరికాదన్నారు.