తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు-ap ts road accidents karimnagar oil tanker overturned chittoor lorry tractor accident 6 died ,తెలంగాణ న్యూస్

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో ట్రాక్టర్, లారీలు ఢీకొని ముగ్గురు మృతి చెందగా, ఖమ్మంలో దంపతులు మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలో డీజిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ఈ మూడు ప్రమాదాల్లో ఆరు మృతి చెందారు. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

కరీంనగర్ జిల్లాలో ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన డీజిల్ ట్యాంకర్ 8 మందిని ఢీకొట్టి బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన శంకరపట్నం మండలం తాడికల్ వద్ద జరిగింది. కరీంనగర్ వరంగల్ రూట్ జాతీయ రహదారిపై పనులు నిర్వహిస్తున్న దిలీప్ కన్స్ట్రక్షన్ కు చెందిన మినీ డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పింది. అతి వేగంగా వచ్చిన ట్యాంకర్ వంకయగూడెం వద్ద ఒక వ్యక్తిని తప్పించబోయి అదే వేగంతో తాడికల్ బస్ స్టేజ్ వద్ద ఉన్న ఎనిమిది మందిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ట్యాంకర్ ఢీ కొట్టడంతో తాడికల్ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలు కాగా వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ట్యాంకర్ క్లీనర్ సైతం గాయపడగా హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో వైద్యుల సలహా మేరకు వరంగల్ ఎంజీఏం ఆసుపత్రికి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

అతివేగమే ప్రమాదానికి కారణం

అతి వేగం.. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్న తరుణంలో కాంట్రాక్టర్ కు చెందిన వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

ఖమ్మంలో దంపతులు మృతి

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ముష్టికుంట్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన సూర్యనారాయణ, రుక్మిణి, మరో ఇద్దరు కలిసి కారులో బోనకల్‌ వైపుగా ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ముష్టికుంట్ల వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ప్రమాదాన్ని గమించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. గాయపడిన వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

చిత్తూరు జిల్లా ఘోర ప్రమాదం-ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలిఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar

Source link