Last Updated:
Nepal: పశ్చిమ నేపాల్లోని దార్చులా జిల్లాలో సంభవించిన భారీ కొండచరియల విలయం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. కొండచరియలు విరిగిపడటంతో చౌలానీ నది ప్రవాహం పాక్షికంగా స్తంభించిపోయింది.
దీంతో నదీ దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) ముంచెత్తే ప్రమాదం ఉందని భావించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. అపీ హిమాల్ రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని భట్టార్ ప్రాంతంలో ఈ భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండల నుంచి భారీగా వచ్చిపడిన రాళ్లు, మట్టి, వ్యర్థాలు చౌలానీ నదిలో పేరుకుపోయి నీటి సహజ ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలిగించాయి. మరిన్ని కొండచరియలు విరిగిపడితే నది పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని, ఆ తర్వాత ఒక్కసారిగా ఆకస్మిక వరదలు దిగువ ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని దార్చులా జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.














