Bengaluru: చీరతో ఉరేసి.. మరుగుతున్న నూనె పోసి.. భార్యను క్రూరంగా చంపిన భర్త.. కారణం ఇదే | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Bengaluru: భార్యపై పెంచుకున్న అనుమానం, మితిమీరిన ఆగ్రహం ఓ నిండు ప్రాణాన్ని అత్యంత పాశవికంగా బలితీసుకున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తాను ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం, తరచూ ఫోన్ బిజీ వస్తుండటాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త కసాయిగా మారాడు. భార్యను చీరతో ఉరివేసి చంపడమే కాకుండా, గుర్తుపట్టకుండా చేసేందుకు మరుగుతున్న వంటనూనెను ఆమె మృతదేహంపై పోసి, ఏమీ తెలియనట్లు నాటకమాడిన భయంకర ఘటన బెంగళూరు మహానగరంలో తీవ్ర కలకలం రేపింది.

కుటుంబ కలహాలు, అనుమానంతో పెరిగిన దూరం

నగరంలోని మైకోలేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘాతుకానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. బిహార్ రాష్ట్రానికి చెందిన రంజిత్ కుమార్ గుప్తా, గుంజా మదేశియా (38) దంపతులు తమ పిల్లలతో కలిసి ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వచ్చి, బిలేకహళ్లి ప్రాంతంలో నివాసముంటున్నారు. రంజిత్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, గత కొద్దిరోజులుగా దంపతుల మధ్య తీవ్రమైన మనస్పర్థలు, కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. తాను విధులకు వెళ్లిన తర్వాత భార్యకు ఫోన్ చేస్తే ఆమె కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, ఒకవేళ చేసినా తరచూ లైన్ బిజీ వస్తుండటంతో రంజిత్ ఆమెపై తీవ్ర అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య నిత్యం తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకునేవి.

పథకం ప్రకారం దారుణ హత్య

ఈ క్రమంలో గురువారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత భార్యాభర్తల మధ్య మళ్లీ ఇదే అంశంపై తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రంజిత్ క్షణికావేశంలో గుంజా మదేశియాపై దాడి చేశాడు. అనంతరం ఇంట్లోని చీరతో ఆమె గొంతుకు గట్టిగా ఉరి బిగించి ప్రాణాలు తీశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు అత్యంత కిరాతకమైన ఆలోచన చేశాడు. వంటింట్లో స్టవ్ వెలిగించి వంటనూనెను బాగా మరిగించి, మృతదేహం ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆమె శరీరంపై ఆ మరుగుతున్న నూనెను పోశాడు.

పోలీసుల విచారణలో గుట్టురట్టు

హత్య అనంతరం ఏమీ ఎరగనట్లుగా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం చీకటి పడే సమయానికి తిరిగి ఇంటికి వచ్చి, తన భార్య వంటింట్లో వంట చేస్తూ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై మరణించినట్లుగా ఇరుగుపొరుగు వారిని, పోలీసులను నమ్మించేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న మైకోలేఅవుట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం స్థితిగతులు, గొంతుపై ఉన్న గాయాలను గమనించిన పోలీసులకు రంజిత్ ప్రవర్తనపై తీవ్ర అనుమానం వచ్చింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు నిజాన్ని కక్కేశాడు. తానే స్వయంగా చీరతో ఉరివేసి హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు మరుగుతున్న నూనె పోసినట్లు శుక్రవారం రంజిత్ నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed