Last Updated:
NTR Statue: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార తీరు సరైనది కాదని మేధావులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకే కాదు తెలుగుజాతికి, యావత్ తెలుగువాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహనీయుడి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Telangana Politics: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాజధానిహైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకే కాదు తెలుగుజాతికి, యావత్ తెలుగువాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రా- తెలంగాణ అనే ప్రాంతీయ విభేదాలు ప్రజల్లో లేకపోయినా.. విభజన తర్వాత రాజకీయ పార్టీల్లో వచ్చాయి. మరీ ముఖ్యంగా గతంలో తెలంగాణలో పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ఈవిషయాన్ని పలుమార్లు బహిరంగ వేదికలపైనే ఈవిషయాన్ని వ్యక్తపరిచారు. ఆపార్టీ నాయకులు కూడా ఆంధ్ర ప్రాంత నేతలకు వ్యతిరేకంగా మాట్లాడారు. చివరకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ సమాధిగా నిర్మించిన ఎన్టీఆర్ గార్డెన్‌ను తొలగించాలని నినాదాన్ని కూడా తెరపైకి తెచ్చారు. అయితే 10ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా- తెలంగాణ వేరు కాదనే సంకేతాన్ని ఇస్తూ వస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో మరోసారి అది సుస్పష్టమైంది. అయితే మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ టీడీపీ నుంచి వచ్చిన నేతలే అయినప్పటికి ఆలోచన విధానంలో ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనేది చాలా మందికి ఉన్న చిన్న డౌట్. అయితే దీనిపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పోలె విక్రమ్ న్యూస్18 ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈవిషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విధివిధానాలపై ఆయన అనుభవాన్ని.. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాల్ని ఉదహరించారు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ విడిపోయి ప్రస్తుతానికి 12 ఏళ్లు పూర్తైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో రాష్ట్ర రాజధాని, పరిపాలన నగరంగా ఉన్న హైదరాబాద్ నుండే నాటి స్థానిక రాజకీయాలు పురుడుపోసుకున్నాయి. జాతీయ పార్టీలకు పోటీగా.. తెలుగుదేశం అనే ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తి, మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు. ఆయన చేరదీసిన వాళ్లు, గుర్తించి టికెట్ ఇచ్చిన వాళ్లలో ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు గత సీఎం కేసీఆర్ కూడా ఎన్టీఆర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఆంధ్రా ప్రాంత నేతలు, ప్రజలు, వలసవాదులను చులకనగా చూడటమే కాకుండా.. ఆంధ్ర ప్రాంత పాలకుల తాలుకు గుర్తుల్ని కూడా చెరిపేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అందుకు ఉదాహరణే నెక్లెస్ రోడ్డు దగ్గర మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధిని ఎన్టీఆర్ గార్డెన్ పేరుతో నగరవాసులకు అహ్లాకరమైన పార్క్ ఏర్పాటు చేశారు.దీన్ని తొలగించి సచివాలయం పక్కనే తెలంగాణ అసెంబ్లీ నిర్మించాలనే ప్రతిపాదన తెచ్చారు గత పాలకులు. అయితే దీనిపై అభ్యంతరాలు ఎక్కువగా రావడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుంది బీఆర్ఎస్ సర్కారు. ఇదొక్కటే కాదు ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నేడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో పెడితే హైదరాబాద్ లో నిరసనలు చేశారు ఆయన అభిమానులు. దీన్ని కూడా నాటి బీఆర్ఎస్ పాలకులు ఇది పొరుగు రాష్ట్రం పంచాయితీ నిరసనలు, ధర్నాలు ఏపీలో చేసుకోమని అభ్యంతరం చెప్పింది. దాని ప్రభావం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకుందని సీనియర్ జర్నలిస్ట్ పోలె విక్రమ్ చెప్పారు.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఎన్టీఆర్ గార్డెన్ తొలగించాలని ప్రతిపాదనను తోసిపుచ్చకపోవడాన్ని కూడా మేధావులు, సీనియర్ పాత్రికేయులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల ప్రయోజనాలు, సెంటిమెంట్‌తో పాటు రాజకీయంగా తమ పార్టీకి లాభం కలిగే విధంగా ఆలోచిస్తాయని కాని ఎన్టీఆర్ అనే వ్యక్తి ప్రాంతాలకు అతీతంగా పని చేసిన వ్యక్తిగా మేధావులు చెబుతున్నారు. తెలంగాణను సాధించినప్పటికి ఆయన రాజకీయంగా ఎదిగింది, ఆయనకు 1983లో స్వల్ప తేడాతో ఓడిపోయిన తర్వాత కూడా 1985లో మళ్లీ టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ టీడీపీ అని మర్చిపోకూడదంటున్నారు. తన కుమారుడికి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కేసీఆర్ సీఎం హోదా వచ్చిన తర్వాత అదే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గుర్తులను చెరిపేయాలనే ప్రయత్నం చేయడం ప్రజాస్వామిక హక్కును అడ్డుకున్నట్లుగానే చూడాలన్నారు. ఆవిషయంలో కేసీఆర్ తన సంకుచిత ధోరణిని ప్రదర్శించారని.. విశాలహృదయంతో ఆలోచించలేదన్నారు పాలె విక్రమ్.
దీనికి ఉదాహరణగా చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో చేపట్టిన నిర్మాణాలను ఉదహరించారు. పార్టీలు వేరైన చంద్రబాబు హైదరాబాద్‌లోని అనేక పార్కులకు జలగం వెంగళరావు పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, సంజీవయ్య పార్కు వంటి పేర్లను కాంగ్రెస్ పార్టీ తరపున సీఎంలుగా పని చేసిన వ్యక్తులను గౌరవిస్తూ పెట్టారు, వాళ్ల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈవిషయంలో కేసీఆర్ అలాంటి ఉన్నతమైన ఆలోచన చేయలేకపోయారని ప్రముఖ జర్నలిస్ట్ విక్రమ్ న్యూస్18కి తెలిపారు.
ఈవిషయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాను టీడీపీ నుండి వచ్చానే విషయం మాత్రమే కాకుండా.. మాజీ సీఎంలకు గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందనే విషయాన్ని, పార్టీకి మంచి జరుగుతుందనే ఆలోచనతో పాటు ప్రజల సెంటిమెంట్‌ని గౌరవిస్తూ మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయంగా చూడాలన్నారు. ఎన్టీఆర్ విగ్రహం నెలకోల్పే విషయంలో రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకున్నారని.. చంద్రబాబు అనుసరించినట్లుగానే రేవంత్ రెడ్డి కూడా అదే తీరుగా నిర్ణయం తీసుకున్నట్లుగా చూడాలన్నారు. రాష్ట్రానికి సేవ చేసిన వారికి విగ్రహాలు పెట్టాలనేది మంచి రాజకీయ వాతావరణంగా చూడాలని సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ తెలిపారు. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు. రాజకీయ ప్రయోజనంతో పాటు పార్టీకి కలిసొచ్చే అంశంగానే చూడాలి తప్ప కేవలం సెటిలర్ ఓటు బ్యాంకు కాపాడుకునే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నరనడం సబబు కాదన్నారు.
తెలుగు రాష్ట్రాలకే కాదు జాతికి సేవ చేసిన వారికి స్మరించుకోవడం వారికి విగ్రహాలు, ప్రభుత్వ భవనాలకు వారి పేర్లు పెట్టడం మంచి సంప్రదాయంగా చూడాలంటున్నారు మేధావులు. సూరవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన జాతీయ వామపక్ష నేత అయినప్పటికి తెలుగు భాష, తెలుగు సంస్కృతికి ఆయన చేసిన సేవలను నాటి నేటికి ప్రజలు మర్చిపోరని విక్రమ్ తెలిపారు. జాతికి, రాష్ట్రాలకు సేవలందించిన ఎన్టీఆర్ లాంటి వారిని ఏదో ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సరికాదని సీనియర్ జర్నలిస్ట్ పోలె విక్రమ్ తెలిపారు.
Hyderabad,Telangana













