Last Updated:
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ దారిలో అన్నామలై నడవబోతున్నారా? అంటే అవునేమో అనే మాటలు వినిపిస్తున్నాయి. జూన్ 5న అతడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Annamalai: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోబోతోంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై త్వరలోనే ఆ పార్టీకి శాశ్వతంగా గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 5 (శుక్రవారం)న చెన్నైలో ఆయన ఒక భారీ రాజకీయ ప్రకటన చేయనున్నట్లు సమాచారం రావడంతో, ఆయన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అన్నామలై బీజేపీని వీడటం దాదాపు ఖాయమైందని కొన్ని నమ్మదగిన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
బీజేపీకి రాజీనామా చేయాలనే తన నిర్ణయంపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న తరుణంలో.. జూన్ 2న అన్నామలై న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాను పార్టీని వీడాలనుకుంటున్నట్లు ఆయన అధిష్టానానికి ముందే తెలియజేశారు. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ప్రస్తుతానికి రాజీనామా నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టాలని (ఆపాలని) అమిత్ షా ఆయనను కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే చర్చిస్తామని అధిష్టానం ఆయనకు హామీ ఇచ్చింది. అయితే, పార్టీని వీడినా అధిష్టానంతో సత్సంబంధాలు కొనసాగించాలని, ఎలాంటి బహిరంగ ఘర్షణలకు తావులేకుండా సామరస్యంగా బయటకు రావాలని అన్నామలై భావిస్తున్నట్లు సమాచారం.
అందిన నివేదికల ప్రకారం.. అన్నామలై కొన్ని నెలల క్రితమే బీజేపీని వీడాలని ప్రణాళిక వేసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లోకి నటుడు విజయ్ టీవీకే పార్టీ ద్వారా అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని అన్నామలై నమ్ముతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
ఈ నేపథ్యంలో, అన్నామలై మొదట ఒక భారీ ‘ప్రజా ఉద్యమాన్ని’ (పీపుల్స్ మూవ్‌మెంట్) ప్రారంభించాలని యోచిస్తున్నారని, అది భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త పార్టీ ఏర్పాటుపై వస్తున్న వార్తలపై అన్నామలై కూడా ముందే స్పందించారు. ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. “దయచేసి వేచి చూడండి. మరో రెండు రోజుల్లో మనం కూర్చుని మాట్లాడదాం” అని చెప్తూ, త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చి తన వైఖరిని స్పష్టం చేస్తానని పేర్కొన్నారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుండి అన్నామలైను తొలగించి, ఆ స్థానంలో నైనార్ నాగేంద్రన్‌ను నియమించడం.. అలాగే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఏడీఎంకే (AIADMK) తో బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిణామాలే అన్నామలై అసంతృప్తికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండి, కేవలం పార్టీ ప్రచారంపైనే దృష్టి పెట్టారు. అయితే, ఆయన అవలంబించిన దూకుడు రాజకీయ శైలి (Aggressive Style) కారణంగా గతంలో మిత్రపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకేతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు అదే పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. అన్నామలై తదుపరి అడుగుపై ఉత్కంఠ కొనసాగుతుండటంతో, రాజకీయ వర్గాలన్నీ ప్రస్తుతం చెన్నై వైపే ఆసక్తిగా చూస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













