Last Updated:
భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా అభివర్ణించిన ఆయన, రష్యాకు భారత్ అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని స్పష్టం చేశారు.
Vladimir Putin: ప్రపంచ సాంకేతిక రంగంలో (Global Technology Sector) రోజురోజుకూ పెరుగుతున్న భారతదేశ ప్రాభవాన్ని, ప్రభావాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) పరిశ్రమలో భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా అభివర్ణించిన ఆయన, రష్యాకు భారత్ అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని స్పష్టం చేశారు.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడిన పుతిన్.. ప్రపంచ సాఫ్ట్వేర్ మార్కెట్లో భారత్ సాధిస్తున్న అద్భుతమైన వృద్ధిని మరియు గ్లోబల్ డిజిటల్ ఎకానమీలో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
“మాకున్న మరో అత్యంత కీలకమైన భాగస్వామి భారతదేశం. ఐటీ పరిశ్రమలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న దేశాలలో భారత్ ఒకటి. గ్లోబల్ సాఫ్ట్వేర్ మార్కెట్లో భారతదేశం చాలా పెద్ద వాటాను కలిగి ఉంది” అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు.
రష్యా, న్యూఢిల్లీల మధ్య సాంకేతికత, ఇంధనం (Energy), రక్షణ, వాణిజ్యం మరియు విద్యా రంగాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న తరుణంలో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాశ్చాత్య మార్కెట్లకు ఆవల తన భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తున్న రష్యా.. భారత్ వంటి ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఎంతో ముఖ్యమని పుతిన్ పదే పదే నొక్కి చెబుతున్నారు.
ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారతీయ ఐటీ సేవల పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు, ప్రభుత్వాలకు డిజిటల్ సేవలను అందిస్తోంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సరికొత్త సాంకేతిక రంగాలలో భారతీయ కంపెనీలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య ఇటీవల కాలంలో డిజిటల్ టెక్నాలజీలు, సైబర్ సెక్యూరిటీ మరియు సరికొత్త ఆవిష్కరణల (Innovation) రంగాలలో పరస్పర సహకారం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో భారత సాంకేతిక శక్తికి, వేగంగా దూసుకుపోతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దక్కిన మరో అంతర్జాతీయ గుర్తింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













